(దండుగుల శ్రీనివాస్)
పాము పగ.. తోక చుట్టం..! అందరినీ తిడుతున్నది కానీ, కవిత తన తండ్రి కేసీఆర్‌ను ఏమనడం లేదని మనం గతంలో చెప్పుకున్నాం. కానీ ఆమె టార్గెట్ తండ్రి, అన్నే. అవును కేసీఆర్‌ను తప్పించి ఇంకెవరిని తిట్టినా.. బీఆరెస్ పార్టీని చెడుగుడు ఆడుకున్నా.. అది తండ్రిని తిట్టినట్టే అంతిమంగా. అది ఆమెకూ తెలుసు. కానీ జనానికే తెలియడానికి కొంచెం సమయం పడుతుండొచ్చు. ఇప్పుడు మెల్లగా ఆమె కేసీఆర్ పేరు కూడా బయటకు తీస్తున్నది. ఆయన కొన్ని తప్పిదాలు చేశాడంటూ విమర్శలు సంధించడం ఆరంభించింది. అంతకు ముందు.. అన్న కేటీఆర్‌కు కూడా హితోక్తుల చెప్పడం చూశాం. చురుక్కులు అంటిస్తున్న వైనమూ కనిపిస్తున్నది. ఇక కేసీఆర్, కేటీఆర్ టీంను కూడా బాగానే అర్సుకుంటున్నది కవితమ్మ. జగదీశ్‌రెడ్డి నుంచి మొదలు పెట్టి లిల్లీపుట్ అనే పదజాలాన్ని వాడి ఆమెకు ఆ టీంపై ఎంత కోపముందో ప్రదర్శించిన సందర్భమూ కనిపించింది.
హరీశ్‌ను, సంతోష్‌ను ఎడాపెడా, చడామడా తిట్టిపోస్తున్న తీరు కూడా రాజకీయాల్లో చర్చకు తెరతీసింది. కేసీఆర్ దేవుడే.. కానీ చుట్టూ దెయ్యాలు.. అని చెప్పి బయటకు వచ్చిన ఆమె.. దయ్యాలన్నింటిపై జనాలకు ఒక క్లారిటీ ఇచ్చింది. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి..వీరే ఇప్పుడు ఆమె టార్గెట్.. దేవుడు అని కొనియాడుతూనే వీరందరినీ తిడుతూ, బీఆరెస్‌ను శాపనార్ధాలు పెడుతూ దేవుడు ముడ్డి కిందే పెద్ద మంట పెట్టే ప్లాన్ ఒకటి పకడ్బందీగా చేస్తూ పోతున్నదనే విషయం ఇప్పటికైతే కొందరికి మాత్రమే తెలుసు.
ముందు ముందు ఈ తెర కూడా ఆమె తీసేస్తుంది. ఏ ఊరు పోయినా.. బీఆరెస్ నేతలకు ఆమె టార్గెట్ చేస్తున్నది. నేను బీఆరెస్ లో లేను.. నాకేం సబంధం అంటూనే.. వీళ్ల వల్లే బీఆరెస్ నిండా మునిగింది.. ఇక తేరుకోదు. చస్తుంది చూడు అంటూ శాపనార్ధాలు పెట్టి మరీ వస్తున్నది. పనిలో పనిగా బీఆరెస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో టచ్‌లో ఉన్నారని తన వ్యాఖ్యలతో రాజకీయాలను తన వైపునకు తిప్పుకుంటున్నది. బీఆరెస్ నేతల్లో కలవరానికి గురి చేస్తున్నది. ఆ పార్టీని కకావిలకం చేస్తున్నది. అంతిమంగా కవిత.. బీఆరెస్‌ను అంతం చేసే పనికి గట్టిగానే పూనుకుని ముందుకు సాగుతున్నదని అనిపిస్తున్నది. కసిగానే కాళ్లకు బలపం కట్టుకుని మరీ జనంబాట పేరుతో బీఆరెస్‌ను బరిబాతల నిలిపే పని కంకణబద్దురాలై చేస్తూ పోతున్నది.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
