(దండుగుల శ్రీనివాస్)
నింగికి నిచ్చెన వేసే మొనగాడైన.. అమ్మ ముందు పసివాడే. ఆ అమ్మ ప్రేమకు బానిస. అమ్మ లాంటి కన్న ఊరంటే కూడా అంతే ప్రేముంటుంంది మరి. అందుకే తనెంత ఎదిగినా.. రాజకీయంగా ఎన్ని పదవులు అధిరోహించినా.. ఆ కన్న ఊరును మరిచిపోలేదు ఈ నిజమైన శ్రీమంతుడు. ఆ ఊరికి వచ్చి తన విలువైన 11 ఎకరాల భూమిని ఊరి బాగు కోసం , పిల్లల చదవుల కోసం విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్‌గల్ మండలం రహత్‌నగర్ ఆయన సొంత ఊరు. ఆ ఊరంటే ఎంతో మమకారం మహేశ్‌కు. ఢిల్లీలో తన పరపతి నిలుపుకున్నా.. హైదరాబాద్‌లో రాజకీయాల్లో ఎంతో బిజీ బిజీగా ఉన్నా.. ఆయన ప్రాణమంతా నిజామాబాద్‌లోనే ఉంటుంది. ఇలా సమయం దొరికితే చాలు .. అలా వచ్చి తన ఊరుకు పోయి ముచ్చటించడం అలవాటు. కానీ ఈ మధ్య రావటం తగ్గినా.. అక్కడి యోగ క్షేమాలు తెలుసుకోవడం మాత్రం అదే రీతిలో కొనసాగిస్తున్నాడాయన. తాజాగా ఆ ఊరికి పోయారు.
ఎమ్మెల్సీ హోదాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన ఊరి కోసం 11 ఎకరాలను విరాళంగా ప్రకటించారు. ఉడతా భక్తిగా తన కన్న ఊరుకు ఇతోధికంగా చేస్తున్న సాయమిదని ప్రకటించుకున్నారాయన. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకున్నారీవిధంగా. ఎంత బిజీగా ఉన్న తన మిత్రులను మాత్రం మరవలేదు. వారినీ తలుచుకున్నారు. తన బాల్యన్నీ నెమరువేసుకున్నారీ సందర్భంగా ఆ వేదిక మీద. ఆ ఊరుకు కారిడార్ రోడ్డు కోసం రూ.380 కోట్ల నిధులను మంజూరు చేయించి పెట్టారు. గతంలో తన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ కూడా తన సొంత నిధులతో అక్కడ దుర్గాదేవీ ఆలయాన్ని నిర్మించారు. తండ్రి బాటలో కొడుకు కూడా తనకు తోచిన సాయం కన్న ఊరు కోసం చేసి పెడుతూ ఆ గ్రామస్తుల దీవెనలు పొందుతున్నారు. మన గంగాధర్ కొడుకు.. ఎంత ఎత్తుకు ఎదిగాడో చూశారా ? అని ఆ గ్రామం మురిసిపోతున్న తరుణంలో.. ఆ కొడుకు ఇలా ఆ గ్రామానికి వచ్చి తను తోడుగా నిలవడం వారిని మరింత పరవశితులను చేసింది. శభాష్.. మహేశ్..! తండ్రిని మించిన తనయుడనిపించుకున్నావ్..! అని ఆ ఊరు ఆశీర్వదించిందీ శ్రీమంతుడిని.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
