(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బలిపీఠం ఎక్కనున్నారు. వైఎస్సార్ జమానాలో 2004లో జరిగిన సీన్ మళ్లీ రిపీట్ కాబోతున్నది. అత్యాశతో, దుందుడుకుతో, దూకుడుతో ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి దూకిన దానం నాగేందర్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురవుతోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద.. దానం నాగేందర్‌ను బలిపీఠం ఎక్కించక తప్పని పరిస్థితి నెలకొంది. స్పీకర్ అనర్హత వేటు వేయకముందే.. సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలు వేయకముందే దానం నాగేందర్ రాజీనామాకు రంగం సిద్ధమవుతోంది. దానం పదవిని బలి ఇవ్వడం వల్ల మిగితా 9 మంది ఎమ్మెల్యేలను రక్షించడానికి అధికార పార్టీ వ్యూహం పన్నుతున్నది. దానం నాగేందర్‌తో పాటు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా పదవీ గండం పొంచి ఉంది. దానం నాగేందర్ మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో అధికార పార్టీ రాజీనామా అస్త్రం సంధిస్తున్నది. ఎందుకంటే.. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే, కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
ప్రత్యక్షంగా నాగేందర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు బలమైన ఆధారాలున్నాయి. తిరుగులేని సాక్ష్యాలున్నాయి. మరోవైపు కడియం శ్రీహరి ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా… తన కూతురును రంగంలోకి దింపి స్వయంగా రథసారథిగా వ్యవహరించి వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కానీ, తాను ప్రత్యక్షంగా పార్టీలో చేరలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానం రాజీనామా కడియంకు రక్షణ కవచంగా మార్చడానికి అధిష్టానం పావులు కదుపుతున్నది. మరోవైపు .. ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కృష్ణామోహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ .. తాము అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్‌ను కలిశామని, తాము కప్పుకున్న కండువా జాతీయ జెండా తప్ప.. కాంగ్రెస్ పార్టీ కండువా కాదని కోర్టుకు వివరణిచ్చారు.
కానీ, బీఆరెస్ మాత్రం వీరంతా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు కోర్టుకు సమర్పించింది. దీనిపై వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అల్టిమేటం ఇచ్చిన క్రమంలో ఎమ్మెల్యేలను రక్షించడానికి, దానంను బలిపెట్టడానికి అధికార పార్టీ పడరాని పాట్లు పడుతోంది. స్పీకర్ కూడా తాను చర్యలు తీసుకున్నానని చేతులు దులుపుకోవడానికి దానంను అడ్డం పెట్టుకుంటున్నారు. మరోవైపు దానం నాగేందర్ అనర్హత వేటు పడకుండా ముందే రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తాను చేసే త్యాగానికి బదులుగా ఎమ్మెల్సీ పదవి నుంచి మంత్రిగా చేయాలని అధిష్టానంతో బేరమాడుతున్నారు. ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు ఫైరవీలు చేస్తున్నారు.
ఖైరతాబాద్ నుంచి మళ్లీ పోటీ చేస్తే బీజేపీ, బీఆరెస్ తనను గెలవనీయవని 2004లో జరిగిన పరాభవం మళ్లీ ఎదురుకావొచ్చని దానం నాగేందర్ ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి, 1989లో ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన దానం నాగేందర్.. ఆ తరువాత ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొని ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994, 1999లో కాంగ్రెస్ నుంచి ఆసిఫ్‌నగర్‌లో విజయం సాధించిన నాగేందర్.. 2004లో అనూహ్యమైన పరిస్థితులలో టీడీపీ నుంచి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలో ఆయనకు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. కానీ, తాను ఎంపీగా గెలవనేమోనన్న అనుమానంతో ఆసిఫ్‌నగర్ టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు.
కానీ రాజశేఖర్‌రెడ్డి నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన స్థానంలో అంజన్‌కుమార్‌కు టికెట్ ఇవ్వగా అనుకోని రీతిలో విజయం సాధించారు. టీడీపీ నుంచి టికెట్ తీసుకున్న దానం .. ఆసిఫ్‌నగర్ నుంచి గెలుపొందారు. కానీ, టీడీపీ ప్రభుత్వం పతనమై కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి అత్యంత అనుచరుడైన దానం నాగేందర్ వైఎస్ ఆశీస్సులు పొంది.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలో బరిలో నిలిచారు. అప్పటి వరకు ఆసిఫ్‌నగర్ కంచుకోటగా ఉన్న ఆయనకు ఈసారి పరాభవం తప్పలేదు.
మంత్రి పదవి రాకపోయినా.. వైఎస్ జమానాలో చక్రం తిప్పారు. తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2009లో పీజేఆర్ మరణానానంతరం ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆపై 2014లో ఓడిపోయి.. 2019లో , 2024లో వరుసగా విజయం సాధించారు. ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీలోకి వెళ్లడం అలవాటుగా చేసుకున్న దానం నాగేందర్ .. మరోసారి గతంలో లాగే చేయాలని ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి పదవిని చేజిక్కించుకోవడానికి చేయరాని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా అధిష్టానంతో సంప్రదించి దానం నాగేందర్‌కు కొంత మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే.. ఆయన మళ్లీ పోటీ చేయాల్సి వస్తుంది. పోటీ చేస్తే గెలుస్తాడా? అనేది తీవ్ర అనుమానంగా చెప్పుకుంటున్నారు.
