(దండుగుల శ్రీ‌నివాస్‌)

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.. చాలా రోజులైంది వేదిక‌లెక్కి మాట్లాడి. అందె శ్రీ సంస్మ‌ర‌ణ స‌భ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడిన తీరు అందరినీ ఆక‌ట్టుకుంది. ఉన్న‌దున్న‌ట్టుగా.. నిజాయితీగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మెచ్చుకోలుగా సాగాయి. అందె శ్రీ అంతిమ యాత్ర‌లో రేవంత్ పాల్గొని, పాడె మోసిన వైనం త‌మ జాతి గుండెల‌క‌త్తుకున్న‌ద‌ని చెప్పుకున్న మోత్కుప‌ల్లి, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌లో రేవంత్ చొర‌వ‌, చూపిన శ్ర‌ద్ద ఎన్న‌డూ మ‌ర‌వ‌లేనిద‌న్నారు. ఇంకా ప‌దేండ్లు సీఎంగా రేవంత్‌ను చూస్తామ‌ని, అందుకు మా జాతి అండ‌గా ఉంటుంద‌ని, ద‌ళిత వ‌ర్గ‌మంతా తోడై నిలుస్తుంద‌ని కూడా ప్ర‌క‌టించారు.

ఇన‌వ్నీ ఒకెత్త‌యితే.. ఎన్టీఆర్‌తో రేవంత్‌ను పోల్చ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ద‌ళితుల కోసం, వారి అభ్యున్న‌తి కోసం ఆనాడు ఎన్టీఆర్ ఒక్క‌డే త‌ప‌న ప‌డ్డార‌ని, ద‌ళిత జాతికి ఎంతో మేలు చేశార‌ని గుర్తు చేస్తూనే.. ఇప్పుడు అదే రీతిలో పేద వ‌ర్గాల మ‌న‌సు, ఆలోచ‌న‌ల‌క‌నుగుణంగా రేవంత్‌రెడ్డి పాల‌న కొనసాగుతున్న‌ద‌ని కొనియాడారు. ఆయ‌న మాట‌ల్లో ఎక్క‌డా అతిశ‌యోక్తి ప్ర‌తిధ్వ‌నించ‌లేదు. లేని డాంబిక‌మూ ప్ర‌ద‌ర్శించ‌లేదు.త‌న‌కు షుగ‌ర్ ఎక్కువ‌య్యింద‌ని, డెబ్బై ఏండ్లు నిండాయ‌ని, ఎప్పుడు పోత‌నో తెలియ‌ద‌ని, త‌న గురించి త‌ను కూడా నిష్క‌ల్మ‌షంగా చెప్పుకొచ్చిన తీరు మ‌న‌సును త‌ట్టింది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబాల కోసం ఆ వేదికగా మాట్లాడిన తీరు.. ప్ర‌భుత్వానికి వారి కుటుంబాల కోసం విన్న‌వించిన వైఖ‌రి ఆయన జాతి కోసం ఎంత‌లా త‌ప‌న ప‌డ్డాడో, ప‌డుతున్నాడో తెలియ‌జేసింది.

అంతిమంగా ఆయ‌న రేవంత్‌ను కౌగిలించుకున్నాడు. కోరి మ‌రీ. కార‌ణం .. అందె శ్రీ పాడె మోసి .. ఆయ‌నకు అత్యున్న‌త గౌవ‌రం క‌ల్పించినందుకు. ఆ గౌర‌వం త‌మ ద‌ళిత జాతికంత‌టికీ ఇచ్చిన‌ట్టేన‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు ఈ వేదిక‌గా మోత్కుప‌ల్లి. త‌న మ‌న‌సులో మాట‌ను ఆవిష్క‌రించిన ఆయ‌న .. అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకున్నాడు. ఆ ప్ర‌సంగం ఆసాంతం ఆక‌ట్టుకున్న‌ది.

Dandugula Srinivas

Senior Journalist

7661066999