వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
కేటీఆర్ డైరెక్షన్‌లో నడుస్తున్న బీఆరెస్.. ఇప్పుడు పక్కా సోషల్ మీడియా బీఆరెస్ పార్టీగా మారింది. కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌కే పరిమితం చేయడం.. ఇదే మంచి తరుణమని పిచ్చి పిచ్చి నిర్ణయాలు, ప్రసంగాలు చేయడం.. పార్టీని పూర్తిగా, మరింతగా భ్రష్టు పట్టించే స్థితికి తీసుకొచ్చింది. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ఆ పార్టీ స్టాండ్, సిద్దాంతాలు పూర్తిగా మారాయి. ఒకప్పుడు అది ఉద్యమపార్టీ. ఇకపై మాది ఫక్తు రాజకీయ పార్టీనని ఆనాడే కేసీఆర్ ప్రకటించి ఉన్నాడు. ఇగో ఇప్పుడు కేటీఆర్ దాన్ని మరింత అధఃపాతాళంలోకి తీసుకుపోతున్నాడు. ఉద్యమకారులను, కార్యకర్తలను పట్టించుకోకుండా ఆ పార్టీ భ్రష్టుపట్టింది మొన్నటి వరకు. ఇప్పుడు కేటీఆర్ దాన్ని మరింతగా దిగజారుస్తున్నాడు. కేవలం సోషల్ మీడియా మీదే ఆధారపడ్డాడు. అదే మళ్లీ తనకు అధికారం కట్టబెడుతుందని పగటి కలలు కంటున్నాడు. ఓడిపోగానే అన్నాడు కదా… మేం ఓ మూడు వందల యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేదని.
ఇప్పుడు అదే చేస్తున్నాడు. కోట్లు వెచ్చిస్తున్నాడు. స్పీచుల్లో మాత్రం మేము మారాము.. ఇకపై ఉద్యమకారులను, కార్యకర్తలను కళ్లలో పెట్టి చూసుకుంటాం.. అని చిలుక పలుకులు పలుకుతున్నాడు. కానీ అది కార్యాచరణలో ఇంచుక మందం కూడా కనిపించడం లేదు. తండ్రిని పట్టించుకోవడం లేదు. ఆయన ఆరోగ్యం మరీ క్షీణిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఓ వైపు కవితను బయటకు గెంటేశారు. హరీశ్ స్థానం నానాటికి దిగదిడుపే అన్నట్టుగా ఉంది పార్టీలో. ఈ సమయంలో కేసీఆర్ మరింత మానసిక క్షోభకు గురవుతున్నాడు. మరోవైపు కేటీఆర్ చేతికి పగ్గాలిస్తే.. పార్టీని పూర్తిగా పెయిడ్ ఆర్టిస్టులతో నింపేశాడనే వేదనా వెంటాడుతున్నది. యూట్యూబ్‌లనే నమ్ముకున్నాడు గానీ… ఉద్యమకారులను, నిజమైన పార్టీ కార్యకర్తలను మాత్రం కరివేపాకులనే చేశాడు కేటీఆర్. అందుకే ఆ పార్టీ ఇప్పుడు ఉద్యమపార్టీ కాదు. తెలంగాణ సాధించి.. ఘనకీర్తి సాధించి .. ప్రస్తుతం భ్రష్టుపట్టిన పార్టీగా క్లైమాక్సులో విషాదాంతంగా మిగిలిపోనుంది.
