(దండుగుల శ్రీ‌నివాస్‌)

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. మైనార్టీ కోటాలో అజ‌హారుద్దీన్ ఓకే అయిపోయాడు. ముహూర్తం కూడా ఖ‌రారైంది. హోం శాఖ ఇస్తార‌ని ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. మూడు బెర్తుల‌కు ఒక బెర్తు భ‌ర్తీ చేసి మిగిలిన రెండు మ‌ళ్లీ ఖాళీ. అవి ఇప్ప‌ట్లో కావు. చేయ‌రు. రెడ్లు, బీసీల మ‌ధ్య పోరుగా ఆ రెండింటిని అంద‌ని ద్రాక్ష‌లా అలా ఉంచేస్తారంతే. ఇప్పుడు టాపిక్ ఏంటంటే.. నిజామాబాద్ జిల్లాను ఎండ‌బెట్టారు. మంత్రి ప‌ద‌వి లేక అది విల‌విల్లాడుతున్న‌ది. చెప్పే దిక్కు లేక‌.. అనాథ‌లా ఆగమ‌వుతున్న‌ది. అయినా నో మంత్రి ప‌ద‌వి. సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్‌, బోధ‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్‌రెడ్డికి ఇస్తార‌ని అంతా అనుకున్నారు. ఊరించి ఊరించి.. ఇక ఇచ్చేది లేద‌నే విధంగా అధిష్టానం ప్ర‌వ‌ర్తిస్తోంది.

ఆయ‌నా ఆశ‌లు వ‌దులుకున్నాడు. హోంమంత్రిని చేస్తాన‌న్నారు. మంత్రి లేదు గింత్రి లేద‌ని తేల్చేశారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల నేప‌థ్యం.. అక్క‌డ మైనార్టీ ఓట్లు కూడా కీల‌కం. అందుకే అవ‌స‌రానికి అజారుద్దీన్ వ‌చ్చాడు. ముందే ప్లాన్ చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు స‌రిగ్గా అదును చూసి మంత్రి ప‌ద‌వి దెబ్బ కొట్టారు. బీఆరెస్‌కు ఇది ఊహించ‌ని షాక్‌. ఈ లెక్క‌న కాంగ్రెస్ .. జూబ్లీహిల్స్ బైపోల్‌ను అంత ఆషామాషీగా ఏం చూడ‌టం లేదు. మిగిలిన ప‌ది రోజుల్లో ఇంకా ఎన్ని ట్విస్టులు చూడాల్సి వ‌స్తుందో.. బీఆరెస్ ఎన్ని షాకులు తినాల్సి వ‌స్తుందో చూడాలి.

Dandugula Srinivas

Senior Journalist

7661066999