(దండుగుల శ్రీ‌నివాస్‌)

సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణ‌యాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. స‌ర్కార్ కొలువులు పొందిన ఉద్యోగార్థుల‌ను కొనియాడుతూనే ఆయ‌న వారికి తెలియ‌కుండా ఓ వార్నింగ్ కూడా జారీ చేస్తున్నారు త‌రుచుగా. మీరు ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం త‌ల్లిదండ్రులే. అవును.. వాళ్లు అప్పోసొప్పో చేసి, రెక్క‌లు ముక్క‌లు చేసుకుని చ‌దివిస్తేనే క‌దా.. ఇప్పుడు ఈ కొలువుక‌లు సాధించి, సంపాదించుకుని అన్నివిధాలుగా స్థిర‌ప‌డే స్టేజ్‌కు వ‌చ్చింది. మ‌రి మూలాలు మ‌రిస్తే..? అంతా త‌మ‌వ‌ల్లే అనుకుని త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోక‌పోతే. వ‌చ్చిన పెళ్లాం మాట‌లు వినో.. ఇంకో ర‌కంగానో త‌ల్లిదండ్రుల‌ను దూరం చేసుకుంటే .. నో న‌థింగ్ ఊరుకునేదే లేదు. వారి జీతాల నుంచి ప‌దిశాతం కోత కోసి మ‌రీ త‌ల్లిదండ్రుల‌కు చెందేలా చేస్తాన‌న్నారు సీఎం. భేష్‌. బాగుంది ఈ విధానం. త‌ల్లిదండ్రుల‌ను మంచిగా చూసుకుంటే స‌రి. లేదంటే ఇజ్జ‌త్ పాయే… జీతంలో ప‌దిశాతం పైస‌లూ పాయె. దీంతో తిక్క కుదురుతుంది వెధ‌వ‌ల‌కు.. అని అంతా మెచ్చుకున్నారు సీఎం నిర్ణ‌యాన్ని.

ఇప్పుడు సినీ నిర్మాత‌ల వంతు వ‌చ్చింది. సినీ కార్మికుల క‌ష్టాన్ని చెమ‌ట‌గా మార్చి అనేక సినిమాలు నిర్మిస్తారు. ఆ కార్మికులు కూడా ఎండ‌న‌కా, వాన‌న‌కా, ఒక్కో స‌మ‌యంలో ప్రాణ‌ల‌కొడ్డి మ‌రీ ఆ రంగుల ప్ర‌పంచంలో త‌మ జీవితాల‌ను హార‌తిక‌ర్పూరంలా క‌రిగిస్తూ ఉంటారు. కానీ ఎన్నేళ్లైనా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా వారి జీవితాలు. ఇప్పుడు వారి జీవితాల్లోకి కొత్త వెలుగులు తీసుకొచ్చారు సీఎం. కొత్త సినిమా తీయ‌గానే పోలోమంటూ సీఎం ద‌గ్గ‌ర‌కు నిర్మాతలు, పెద్ద పెద్ద హీరోలు ప‌రిగెత్తుకు రావ‌డం.. టికెట్ల ధ‌ర‌లు అమాంతం పెంచుకోవ‌డానికి పర్మిష‌న్ అడిగి, మొహ‌మాట పెట్టి మ‌రీ తీసుకుని పోవ‌డం .. ఇది ప‌రిపాటిగా మారింది.

కోట్లు ఖ‌ర్చు పెట్టాం… పాన్ ఇండియా సినిమా.. అంటూ ఏవో సాకులు, కార‌ణాలు ఉండ‌నే ఉన్నాయి. కానీ ఆ సినిమా నిర్మాణంలో కూలీలైన సినీ కార్మికుల ప‌రిస్థితిని మ‌రిచిపోతారు. ఇప్పుడు సీఎం వీరి జీవితాల మీద న‌జ‌ర్ పెట్టాడు. టికెట్ల రేట్లు పెంచాలంటే ఆ వ‌చ్చిన దాంట్లో క‌చ్చితంగా ఓ 20 శాతం సినీ కార్మికుల‌కు ఇవ్వాల్సిందే. అయితేనే జీవో అని కొత్త రూల్ పెట్టాడు. నిర్మాత‌లు, పెద్ద హీరోల గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ‌పడ్డ‌ట్ట‌య్యింది. సినీ కార్మికుల దృష్టిలో రేవంత్ హీరో అయ్యారు. అంతే కాదు… కార్మికుల సంక్షేమం కోసం రూ. 10 కోట్ల వెల్ఫేర్ ఫండ్ కూడా ఇచ్చారు. పిల్ల‌లు చ‌దువుకోవ‌డానికి మంచి స్కూళ్లు కూడా నిర్మించి ఇస్తామ‌ని మాటిచ్చాడు. ఇవ‌న్నీ ఇంత‌కు మునుపు జ‌ర‌గ‌లే. క‌నీసం ఎవ‌రూ ప‌ట్టించుకోలే. అందుకే ఆ రంగుల ప్ర‌పంచంలో వీరి బ‌తుల‌కు అంధ‌కార‌మ‌వుతూ వ‌చ్చాయి. ఇప్పుడు రేవంత్ ద్వారా కొత్త వెలుగులు వ‌స్తున్నాయి.

Dandugula Srinivas

Senior Journalist

7661066999