(దండుగుల శ్రీనివాస్)
పొన్నం ప్రభాకర్ ఎపిసోడ్ మరిచిపోకముందే.. ఆ తలనొప్పి వ్యవహారాన్ని ఇంకా చక్కదిద్దకముందే.. కొండా ఫ్యామిలీ రూపంలో రేవంత్ సర్కార్‌కు మరో తలవంపుల ఘట్టం ఎదురైంది. మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి మొదటి నుంచి అంతే. వివాదస్పదం. కొండా మురళి సరేసరి. ఇప్పుడు కూతురు సుష్మ కూడా ఎంట్రీ అయ్యింది. మంత్రి పదవి రావడమేమో గానీ.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయ్యింది ఈ ఫ్యామిలీకి. చేసేవి బెదిరింపు రాజకీయాలు.. కాపాడుకోవడానికి మాత్రం బీసీ కార్డు ప్రయోగం. ఇప్పుడు కూడా అదే జరిగింది. సర్కార్ ఏర్పడిన తొలినాళ్లలోనే కొండా సురేఖ పెట్టిన పెంట అంతా ఇంతా కాదు.
ఏకంగా నాగార్జున కోడలిగా ఉన్న సమంతను ఆడిపోసుకున్నది. అనవసరమైన ఆరోపణలు చేసి మరీ దిగజారి మాట్లాడింది. సోయి తప్పి ఆమె మాట్లాడిన మాటలు నాగార్జునను కోర్టు మెట్లెక్కేలా చేశాయి. సర్కార్ పరువును కోర్టుకీడ్చేందుకు వెనుకాడలేదు నాగార్జున. కానీ అప్పుడు కాపాడింది ఈ రేవంత్ సర్కారే. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ద్వారా ఆమె వ్యవహారాన్ని చక్కదిద్ది సపోర్టుగా నిలిచింది కూడా రేవంతే. కానీ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఇప్పుడు ఆమె, ఆమె ఫ్యామిలీ సర్కార్ పరువును మరోసారి బజారులో పెట్టారు. కొండా సురేఖ బిడ్డె సుష్మిత క్లాస్మేట్ సుమంత్. పీసీబీలో ఓ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్. అతగాడిని ఓఎస్డీగా పెట్టుకున్నారు. వాడు వెళ్లి దక్కన్ సిమెంట్ ప్రతినిధులను గన్‌పెట్టి బెదిరించాడు. భారీగా డబ్బులు డిమాండ్ చేసి ఇస్తావా…? రూల్స్ పాటించడం లేదని పీసీబీ నుంచి దుకాణం మూసేయంచాలా? అని బెదిరించాడు. ఇది కాస్తా మంత్రి ఉత్తమ్ దాకా వెళ్లింది.
ఆయన ఏమైనా సంయమనం పాటించాడా? లేదు. సిమెంట్ వ్యాపారులతో కాకుండా తానే ఫిర్యాదు చేశాడు పోలీసులకు. ఈ సమంత్ ఏమన్నా తగ్గాడా? వెనుక కొండంత ధైర్యంగా కొండ ఫ్యామిలీ ఉందిగా. అందుకే మళ్లీ పీకమీద కత్తిపెట్టినట్టు బెదిరించాడు ఆ సిమెంట్ వ్యాపారులను. ఇక లాభం లేదని ఉత్తమ్ ఏకంగా సీఎం రేవంత్‌కు, మీనాక్షి నటరాజన్‌కూ ఫిర్యాదు చేయడంతో విషయం పాకాన పడింది. సీఎం సీరియస్ అయ్యాడు. తీసేయండి వాడిని అని హుకుం జారీ చేశాడు. ఓఎస్డీ నుంచి టర్మినేట్ చేశారు. కొంచెం ఓపిక పట్టి వాడిని అరెస్టు చేస్తే సరిపోయేది. అర్థరాత్రి మఫ్టీలో పోలీసుల హడావుడి.. తమకు అలవాటైన దోరణిలో కొండా ఫ్యామిలీ రచ్చ రాజకీయం సర్కార్ పరువును బజారు కీడ్చాయి.
అంతా అనుకున్నట్టే కొండా ఫ్యామిలీ మళ్లీ బీసీ కార్డు ప్రయోగించింది. మరి ఒక్క బీసీ కులం కాదు.. ఆ ఇంట్లో ఇద్దరు బీసీలు. ఒకరు మున్నూరుకాపు. మరొకరు పద్మశాలి. ఇప్పుడు సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఈ రెండు బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేసినట్టే… ఆ కులాల అభివృద్ధిని అడ్డుకున్నట్టే. ఆ కులాలను అవమానపరిచినట్టే. అంతేనా? కాదంటారా??
Dandugula Srinivas
7661066999
