(దండుగుల శ్రీనివాస్)
ఎట్టకేలకు కవిత ఆత్మవంచన వీడింది. అవును.. ఆమె మొన్నటి దాకా డబుల్ గేమ్ ప్లే చేసింది. ఓవైపు బీఆరెస్‌ను తుక్కు తుక్కు తిట్టాలె. అంతా అవినీతి జరిగిందని, హరీశ్, సంతోష్ రావులు దొంగలని ధ్వజమెత్తాలె… కానీ కేసీఆర్‌కు పాపం ఇవేమీ తెలియవని నమ్మబలకాలె. తండ్రి బాటలోనే సాగుతానంటూ ప్రజలకు వివరించాలె. జనం పిచ్చోళ్లయ్యారు. అసలు ఆమె ఏం చెబుతున్నది. ఏం మాట్లాడుతున్నదో అర్థం కాక … కవితను లైట్ తీసుకోవడం ప్రారంభించారు. ఈ విషయం ఆమె కోటరీకి తెలియలేదు కానీ.. క్షేత్రస్థాయిలో ఉన్న జాగృతి కార్యకర్తలకు, కవిత అభిమానులకు మాత్రం తెలిసింది.
అందుకే ఆమెకు స్పష్టంగా చెప్పారు. డబుల్ గేమ్ వద్దు. మనల్ని కాదన్న ఆ పార్టీ వద్దు.. ఆ నేతా వద్దు.. కేసీఆర్‌ను మనం వీడాలె.. ఫోటో వాడొద్దు..అని ఖరాకండిగా చెప్పేశారు. దీంతో కవితకు అప్పుడుగానీ తను చేస్తున్న తప్పిదం అర్థం కాలేదు. ఆత్మవంచన గుర్తు కు రాలేదు. అందుకే ఆమె ఎట్టకేలకు ధైర్యం చేసి ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే చెప్పేసింది. తను ఇకపై కేసీఆర్ ఫోటో వాడటం లేదని. అంతే తన దారి తనది. ఇంకో మాట కూడా అన్నదండోయ్! ఇకపై ఆ చెట్టు నీడన ఉండను. ఆ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోను అని. బాగానే ఉంది. కానీ ఆ చెట్టును ఇన్నాళ్లు తను కాపాడిందంట. నవ్వకండి.
నలుగురి పిల్లల తల్లికి ఒక్కపిల్ల తల్లి చెప్పొచ్చిందట. అట్లనే ఉన్నాయి కవిత మాటలు. ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు దాదాపు నాలుగు నెలలు ఆమె జాగృతి జనం బాట పేరిట యాత్ర చేపట్టనుంది. ఆ తరువాత పార్టీ పేరు, గుర్తు అనౌన్స్ చేయనుంది. పార్టీ ఏర్పాటు కోసమే జనం అభిప్రాయం తెలుసుకుంటామని ఆమె ఆ యాత్ర చేపడుతున్నది. ఒక్కో ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల పాటు ఆమె పర్యటించనుంది.
