(దండుగుల శ్రీ‌నివాస్‌)

కారు పార్టీని బేకార‌ని జ‌నం తేల్చేశారు. షెడ్డుకు పంపించేశారు. ఫామ్‌హౌజ్‌లో ప‌డుకోబెట్టారు. కానీ ఇంత జ‌రిగినా.. వారు మాత్రం తీరు మార్చుకోలేదు. అహంకారం వీడ‌లేదు. ఎక్క‌డ పొర‌పాట్లు చేశామో త‌రిచి చూసుకోలేదు. లోపాలు, శాపాలు లెక్క‌లు తీయ‌డం లేదు. వాటి పాప ప్ర‌క్షాళ‌న‌కు ఇంకా పూనుకోనూ లేదు. కానీ జ‌నం మీద ప్ర‌తీకారం మాత్రం తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎందుకంటే, త‌మ‌నే ఓడిస్తారా? అనే అహంకారం. జాతిపిత‌నే ఫామ్‌హౌజ్‌కు ప‌రిమితం చేస్తారా? అనే దురంహ‌కారం. కోపం. అందుకే ఇప్పుడు బీఆరెస్ చూసేది జ‌నం మేలు కోసం కాదు.. వారు ఎంత‌లా బాధ‌ప‌డితే అంత సంతోషంగా ఫీల్ కావాల‌నే. ఇది ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త అని చెప్పేందుకు,

చూశారా.. ! మ‌మ్మ‌ల్ని ఓడించారుగా ఇప్పుడు అనుభ‌వించండ‌ని జ‌నాల వైపు ఓ పైశాచికానంద చూపు విసిరేందుకు రెడీగా ఉన్నారు. చేస్తున్న‌ది కూడా అదే. చేయాల‌నుకుంటున్న‌ది కూడా అదే. ఇప్పుడు అర్జెంటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు అనివార్యంగా మారింద‌ని భావిస్తున్న‌ది ఆ పార్టీ. దీంట్లో గెలిస్తే త‌ప్ప మ‌నం ఇంకా జ‌నంలో ఉన్నామ‌ని అంతా అనుకుంటారు.. లేక‌పోతే బేకారు పార్టీ.. షెడ్‌కు పోయింద‌నేది మ‌రింత రూఢీ అయి కారు తుక్కు కింద అమ్ముకోవాల‌సి వ‌స్తుంద‌నే భ‌యాన్ని ఇలా కార్య‌క‌ర్త‌ల ముందు బ‌ల‌వంతంగా రుద్దుతున్నాడు రామ‌న్న‌. ప‌రివ‌ర్త‌న రాని కేటీఆర్‌.. ఎన్ని స్పీచులిచ్చినా లాభం లేదు. ఎన్ని పైస‌లు కుమ్మ‌రించినా గ‌ట్టెక్క‌డం క‌ష్టం. కార్య‌క‌ర్త‌ల‌, ఉద్య‌మ‌కారుల ఉసురు త‌గిలింది మ‌రి. యువ‌త, వారి త‌ల్లిదండ్రుల శాప‌నార్దాలు ఘోషిస్తూనే ఉన్నాయి మ‌రి.