(దండుగుల శ్రీ‌నివాస్‌)

సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టుగా త‌న కామెంట్స్‌తో ఇటు బీజేపీ, అటు బీఆరెస్‌ను ఇరుకున పెట్టారు. ఖుల్లం ఖుల్లాగా ఆ రెండు పార్టీల ర‌హ‌స్య దోస్తానాను బ‌ట్ట‌బ‌య‌లు చేసే ప‌నిలో దండ‌యాత్ర‌ను తీవ్ర‌త‌రం చేశారు. కాళేశ్వ‌రం పై సీబీఐ విచార‌ణ ఎందుకు జ‌ర‌గ‌డం లేదో ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెప్పారు. కేటీఆర్ చెబితే కిష‌న్‌రెడ్డి వింటున్నాడని, అందుకే సీబీఐ ఇంకా కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతిపై కిమ్మ‌న‌డం లేద‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. కేటీఆర్ ఎట్లా చెబితే అట్ల కిష‌న్‌రెడ్డి న‌డుచుకుంటాడ‌ని కూడా అన్నారాయ‌న‌. ఈ రెండు పార్టీల తెర వెనుక ఒప్పందాలు, క‌ల‌యిక‌, పొత్తుల అంశాల‌ను జ‌నం ముందు విడ‌మ‌ర్చి చెప్పారు సీఎం. ఉప రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో అందుకే ఓటింగుకు దూరంగా బీఆరెస్ ఉన్న‌ద‌ని, త్వ‌ర‌లోనే ఈ రెండు పార్టీలు క‌లిసిపోతాయ‌ని చెప్పుకొచ్చారు సీఎం. కాంగ్రెస్‌ను ఒంట‌రి చేసేందుకు రాజ‌కీయంగా ఏంచేయాలో అన్నీ చేస్తున్నార‌ని సీఎం అన్నారు. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా బీజేపీ, బీఆరెస్ రాష్ట్రంలో ప‌వ‌ర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనిపై సీఎం దండ‌యాత్ర మ‌రింత దూకుడుగా కొన‌సాగుతోంద‌ని తెలుస్తోంది ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి.

యూరియా కొర‌త సృష్టి కూడా బీజేపీ కావాల‌ని చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇది ఉన్న‌ప‌ళంగా ఎవ‌రికి లాభం చేకూరుస్తుందో కూడా వివ‌రించారు. రైతులు బాధ‌లు ప‌డితే కాంగ్రెస్‌ను తిట్టుకోవాల‌ని, దీన్ని బీఆరెస్ క్యాష్ చేసుకోవాల‌ని అందుకే బీజేపీ ఈ విధ‌మైన దుర్మార్గ‌మైన చ‌ర్య‌కు పూనుకున్న‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేంద్రం కావాల‌నే యూరియాను స‌రిప‌డా పంప‌డం లేద‌ని, కిష‌న్‌రెడ్డి కూడా దీనికి స‌పోర్టు చేస్తూ .. బీఆరెస్‌కు లాభ‌మ‌య్యేలా ప‌ని చేస్తున్నార‌ని విమర్శించారు. సీఎం ఢిల్లీలో చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. బీజేపీ, బీఆరెస్ ఎప్ప‌టికైనా క‌లిసే పార్టీలేన‌ని ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కొంత‌లో కొంత అర్థ‌మైపోయింది. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్య‌లు వీరిద్ద‌రి ర‌హ‌స్య బంధాన్ని మ‌రింత బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్న‌ది.

 

పార్టీ ఫిరాయింపుల‌పై కూడా సీఎం రేవంత్‌రెడ్డి టిట్ ఫ‌ర్ టాట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనిపైనా ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందిచారు. కండువాలు వేస్తే పార్టీ ఫిరాయించిన‌ట్టా అని కొట్టిపారేశారు. ఓ వైపు ఉప ఎన్నిక‌లొస్తాయి.. అని చంక‌లు గుద్దుకుంటున్న కేటీఆర్‌కు గ‌ట్టి షాక్‌నిచ్చారు సీఎం. వాస్త‌వానికి దీనిపై సోష‌ల్ మీడియాలో కేటీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. అప్పుడు మీరు చేసిందేమిటీ..? సిగ్గు లేకుండా ఈ విష‌యంపై గ‌గ్గోలు పెడుతున్నావా? అంటూ కేటీర్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం స్వ‌యంగా ఈ ఇష్యూను పూచిక‌పుల్లలా తీసిపారేయ‌డంతో ఈ క‌థ‌కు శుభం కార్డు వేసిన‌ట్ట‌య్యింది.