(దండుగుల శ్రీ‌నివాస్‌)

కాళేశ్వ‌రం క‌థ సీబీఐకి చేరింది. స‌ర్కార్ దీనికి ఓ విధంగా త‌న ప‌రిధిలోంచి ఓ ఫినిషింగ్ ట‌చ్ నిర్ణ‌య‌మే తీసుకున్న‌ది. దీన్ని ఇంకా కొన‌సాగిస్తూ.. సాగిస్తూ.. లాగుతూ పోవ‌డం ఎవ‌రికీ లాభ‌దాయ‌కం కాదు. జ‌నాల‌కు ఇంట్ర‌స్టు లేని స‌బ్జెక్టుగా నిలిచే పోయే ప్ర‌మాద‌మూ ఉంది. స‌ర్కార్ చేయాల్సిన విధులు, బాధ్య‌త‌లు చాలానే ఉన్నాయి. అదే స‌మ‌యంలో ఇంకా జ‌నం మ‌న‌సు గెలుచుకునే స‌మ‌య‌మూ ఉంది. ఈ స‌మయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన సంద‌ర్భాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గ‌తంలో గుర్తు చేశారు కూడా. త‌ను ఎవ‌రినీ వేధించ‌న‌ని, వేటాడ‌న‌ని కూడా ప‌రోక్షంగా ఆయ‌న కేసీఆర్ అండ్ ఫ్యామిలీ.. కేసుల విష‌యంలో త‌న వైఖ‌రి వెల్ల‌డించారు. ఎట్ట‌కేల‌కు సుధీర్ఘ చ‌ర్చ‌లు, వాదోప‌వాదాలు, విమ‌ర్శ‌లు నేప‌థ్యంలో దీనికి అసెంబ్లీలో స‌ర్కార్ ముగింపునిచ్చింది. ఈ కేసు బంతిని సీబీఐ ముందుంచింది. కేంద్రం, కేసీఆర్ ఇప్పుడు చూసుకోవాల్సి ఉంది. వీరిద్ద‌రు తేల్చుకోవాల్సి ఉంది. మ‌రి కాళేశ్వ‌రం క‌థ కంచికి చేరిన‌ట్టేనా..? దీన్ని వినియోగంలోకి తీసుకురాలేమా..? అనేదానిపై ఇప్పుడు స‌ర్కార్ దృష్టి సారించాల్సి ఉంది.

వాస్త‌వానికి, ఈ కేసు విచార‌ణ‌కు, సీబీఐ అప్ప‌గింత‌కు.. కాళేశ్వ‌రాన్ని మ‌ళ్లీ వినియోగంలోకి తీసుకురావ‌డానికి సంబంధం లేదు. ల‌క్ష కోట్ల నిధులు వృథా పోకుండా ఉండేందుకు.. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఆల్ట‌ర్నేట్ మార్గాలు స‌ర్కార్ తీసుకోవాల్సి ఉంది. ఆ దిశ‌గా ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడిదే స‌ర్కార్ క‌ర్త‌వ్యంగా కూడా ఉంది. రానున్న రోజుల్లో దీనిపై ముంద‌డుగు ప‌డితే.. జ‌నం నుంచి కూడా ఆమోదం ఉండే అవ‌కాశం ఉంది. కేసీఆర్ చేసిన త‌ప్ప‌దాల‌ను తాను సరిదిద్ది రైతాంగానికి మేలు చేసేలా ఈ భారీ నీటి పారుద‌ల ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావ‌డం మూలంగా స‌ర్కార్‌కు కూడా మంచి పేరు వ‌స్తుంద‌నడంలో సందేహం లేదు.

స‌రే, ఆ సంగ‌త‌లా ఉంచితే.. ఈ సీబీఐకి అప్ప‌గింత‌… ఏ రాజ‌కీయ పార్టీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూరింది..? ఎవ‌రిని న‌ష్టం వాటిల్లింద‌నే కోణంలో చూస్తే.. పిట్ట పిట్ట పోరు పిట్ట‌పోరు పిల్లి తీర్చింద‌న్న‌ట్టుగానే మారింద‌ని చెప్పాలి. కేంద్రం చేతిలోకి కేసీఆర్ పూర్తిగా వెళ్లిపోయిన‌ట్టే. ఇప్ప‌టికే చాలా సంద‌ర్భాల్లో కేసీఆర్‌ను త‌న గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ చేయ‌ని ప్ర‌య‌త్నం చేదు. కేసీఆర్ కూడా మొండిగా ఉన్నా… త‌న ప‌రిస్థితులు, రాజ‌కీయ అవ‌స‌రాల కోసం బీజేపీతో అంట‌కాగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రానున్న ఎన్నిక‌ల నాటికి ఈ రెండు పార్టీ బంధం బ‌ల‌ప‌డి… అది పొత్తు పొడిచే దిశ‌గా అడుగులు వేస్తుంద‌నే రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల నేప‌థ్యంలో… తాజా ఈ కాళేశ్వ‌రం కేసు కూడా కేంద్రానికి ఓ మంచి అస్త్రంగా దొరికింద‌నే చెప్పాలి.

ఎన్నిక‌ల ముందు దీనిపై విచార‌ణ చేసి నిజ‌నిజాలు నిగ్గు తేలుస్తామ‌ని కాంగ్రెస్ హామీ ఇచ్చిన‌ట్టుగానే త‌న ప‌నిని తాను చేసేసింది. అసెంబ్లీ ద్వారా ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని జ‌నం ముందు ఉంచ‌గ‌లిగింది. అంత వ‌ర‌కు ఆ పార్టీ స‌క్సెస్ అయిన‌ట్టే. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నెర‌వేర్చుకున్న‌ట్టే. రేవంత్ మాట‌పై జ‌నం గురి కుదిరినట్టే. అయితే అంతిమంగా దీని ఫ‌లితం మాత్రం క‌ట్టె విర‌గ‌దు.. పాము చావ‌దు అన్న‌ట్టుగానే ఉండ‌బోతుంది. ఎందుకంటే.. కేంద్రం.. కేసీఆర్‌ను బెదిరించి అదిరించి… త‌న గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చుకునే క్ర‌మంలో ఈ మంత్ర‌దండాన్ని ఉప‌యోగిస్తుంది. దీని కోసం రాష్ట్ర బీజేపీ కూడా ఎదురుచూస్తోంది. అది ఎదురుచూసిన‌ట్టుగానే.. కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్టుగా రేవంత్‌.. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డం అంద‌రికంటే రాష్ట్ర బీజేపీనే సంతోష‌పెట్టింది.

రెండేండ్లు అధికారం పూర్త‌వుతున్న త‌రుణంలో ఇక పాత కేసులు తోడుతూ.. అవినీతి లెక్క‌లు తీస్తూ.. కేసుల విచార‌ణ పేరుతో కాల‌యాప‌న చేసే ప‌నికి స‌ర్కార్ త్వ‌ర‌గా చెక్ పెట్టి.. త‌న కార్య‌చ‌ర‌ణ‌పై దృష్టి పెట్టాల్సిన సంద‌ర్భం ఆస‌న్న‌మైంది. అది రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. అందుకే ఈ పెద్ద కేసుకు ఇలాంటి క్లైమాక్స్ ఇచ్చి మీరూ మీరూ చూసుకోండ‌ని వ‌దిలేసిన‌ట్టుగానే ఉంది. వీరిద్ద‌రి ర‌హ‌స్య స్నేహ బంధం త్వ‌ర‌లో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. కాంగ్రెస్ కూడా ఈ విష‌యాన్ని జ‌నం ముందు బ‌లంగా తీసుకెళ్లి… కాంగ్రెస్ పార్టీకి మేలు జ‌రిగే విధంగా తన రాజ‌కీయ వ్య‌హాల‌కు ప‌దును పెట్ట‌నుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed