(దండుగుల శ్రీనివాస్)
కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టు.. కేటీఆర్ అసెంబ్లీలో లేవనెత్తి అంశం.. బూమరాంగైంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ భారీగా అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చారని, తెలంగాణ నిధులన్నీ పక్కదోవ పట్టించారని కేటీఆర్ ఆరోపించారు. ఎందుకు ఇక్కడి సొమ్మునంతా అక్కడ ధారపోస్తున్నారంటూ విరుచుకుపడ్డాడు. ఇదేదో సర్కార్‌ను బాగనే ఇరుకున పెట్టానని ఆయన అనుకునేలోపు.. ఆది శ్రీనివాస్ అందుకున్నాడు. భారత రాష్ట్ర సమితి నేపథ్యం నుంచి నరుక్కొచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి అని నామకరణం చేసి.. తెలంగాణ అనే పదాన్నే దూరం చేసుకున్నారని గుర్తు చేశారు.
గుజరాత్‌లో రైతులకు ఇక్కడి సొమ్మును చెక్కుల రూపంలో విరాళంగా, ఉదారంగా ఇచ్చేశారు.. గుర్తుందా ? అని నిలదీశారు.భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నందుకు ఇదంతా చేశారని, మహారాష్ట్రంలో ఒక్క సర్పంచును కూడా గెలిచే సీన్ లేదని తెలిసి కూడా.. అక్కడ పరపతి కోసం.. పాగా వేసేందుకు.. మీటింగు పెట్టినప్పుడల్లా వందల కోట్లు గుమ్మరించారని గుర్తు చేశారు. ఒక్కవేలు అటు చూపితే .. మిగిలిన నాలుగు వేళ్లూ.. కేసీఆర్ ఆనాడు చేసిన విచ్చలవిడితనం.. నియంతృత్వ పోకడలపై సభ్యుడు అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడటంతో తోక ముడవటం కేటీఆర్ వంతైంది.