(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప్ర‌జ‌ల జీవ‌నాధారంగా బీఆరెస్ చెప్పుకున్న కాళేశ్వ‌రం చివ‌ర‌కు ప్ర‌జ‌ల సొమ్మును గంగ‌పాలు చేసిన ప్రాజెక్టుగా బ‌య‌ట‌ప‌డింది. స‌గం ఇంజినీర్‌గా త‌న‌కు తాను గొప్ప‌లు చెప్పుకున్న మాజీ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌, క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. అన్నీ తానుగా నిర్మించిన కాళేశ్వ‌రం చివ‌ర‌కు కూలేశ్వ‌రంగా పేరును మార్చ‌కుంది. మేడిగ‌డ్డ వ‌ద్ద కుంగిన ఫిల్ల‌ర్లు ఆ ప్రాజెక్టు అవినీతి, అప్ప‌టి నేత‌ల ఇష్టారాజ్యం.. నియంత పోక‌డ‌ల తీరు తెన్నులకు స‌జీవ సాక్షంలా నిలిచాయి. ఎన‌భై వేల కోట్ల నుంచి ల‌క్ష కోట్ల‌కు అంచ‌నా వ్య‌యం పెంచి, అవినీతికి ఆల‌వాలంగా మార్చి.. జ‌నాల సొమ్ము ఏమార్చి.. బూడిద‌లో పోసిన ప‌న్నీరులా.. ల‌క్ష కోట్లు గంగలో క‌లిపిన‌ట్టు చేసింది బీఆరెస్ స‌ర్కార్‌. కేసీఆర్ పాల‌న‌. ఇదంతా నేను చెబుతున్న క‌హానీ కాదు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఇచ్చిన రిపోర్టులో వెల్ల‌డైన నిజాలు. నేటి నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా జ‌నం ముందుకు రాబోతున్న కూలేశ్వ‌రం క‌హానీ. ప‌లాయ‌న‌వాదం చిత్త‌గించి.. త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ! అన్న‌ట్టుగా మామా, అల్లుండ్లు న్యాయ స్థానం మెట్లెక్కినా లాభం లేక‌పోయింది. జ‌రిగిన డ్యామేజీ క‌నిపిస్త‌నే ఉంది. జ‌రిగిన న‌ష్టం, అవినీతి క‌ళ్ల‌ముందే ఉంది. చేసిన పాపం, నిర్ల‌క్ష్యం.. స‌జీవ సాక్షంలా ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంది. మ‌రెలా త‌ప్పించుకుంటారు. నో చాన్స్‌. నో మోర్ ఆప్ష‌న్స్‌.

ఓ సారి బాంబులు పెట్టి పేల్చారేమో అని త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తారు. వాన‌లు బాగా కురిసి.. కురిసి.. కురిసి.. అవి కుంగిపోయాయ‌ని కోర్టునే ప‌క్క‌దారి ప‌ట్టిస్తారు. కానీ ఏమి చేసినా పాపం వెంటాడుతూనే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి అన్న‌ట్టు.. ఎవ‌రి క‌ర్మ ఫ‌లం వాళ్లు అనుభ‌వించ‌క‌త‌ప్పదు. ఆ ఫ‌లం వ‌చ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అసెంబ్లీ వేదిక‌గా కాళేశ్వ‌రం క‌మిష‌న్ రిపోర్టుపై స‌భ్యుల‌తో చ‌ర్చించిన త‌రువాత తదుప‌ని చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌దు. దీనికి బాధ్యులుగా కేసీఆర్‌, హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్ నిల‌వాల్సిందే. దీని ప్ర‌తికూల ఫ‌లితం, జ‌నంతో ఆడుకున్న దుశ్చ‌ర్యకు శాపం అనుభ‌వించాల్సిందే. ల‌క్ష కోట్లు గంగ‌లో క‌లిపి దీన్ని ఇప్ప‌టికీ ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం బీఆరెస్‌కే చెల్లింది. చేసిన నేరానికి, అవినీతికి త‌గిన చ‌ర్య‌ల‌కు జవాబుదారీ కావాల్సిందేన‌నే విష‌యం క్లారిటీ వ‌చ్చింది వారికి. ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు.

అసెంబ్లీకి కేసీఆర్ వ‌స్తారా..? రారా?? ఇప్పుడు ఈ చ‌ర్చ జోరుగు సాగుతుంది. ఆయ‌న మామూలు అసెంబ్లీ స‌మావేశాల‌కే డుమ్మా కొట్టాడు. ఎందుకు? జ‌నంపై కోపం. ప్ర‌శ్నించే వేదిక‌లంటే చిరాకు, ప‌రాకు, జంకు. అప్పుడు ప్ర‌తిప‌క్షం లేకుండా చేసుకుని త‌నను అసెంబ్లీలో ఎవ‌రూ ప్ర‌శ్నించొద్ద‌నే నియంత పోక‌డ‌ల‌ను అమలు చేసి చూపిన ఘ‌నుడు కేసీఆర్‌. ఇప్పుడు అదే ప్ర‌తిపక్షం.. అధికార ప‌క్ష‌మై.. చేసిన త‌ప్పుల‌ను ముందుంచి నిల‌దీసి, క‌డిగేసి, జ‌నం ముందు నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తానంటే ఎలా వ‌స్తాడు. రాడు. దీనిపై చ‌ర్చ పెద్ద‌గా అవ‌స‌రం లేదు. ఎంత వీలైతే అంత తొంద‌ర‌గా దీనిపై డిస్క‌ష‌న్ పూర్తి చేసి.. త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు దిగితేనే గానీ జ‌నానికి కూడా ప్ర‌శాంత‌త ఉండ‌దు. ఎందుకంటే ఈ స‌ర్కార్ కూడా ఇంకా చాలా బాధ్య‌త‌లు మిగిలిపోయే ఉన్నాయి. వాటిని నెర‌వేర్చేందుకు, జనం మ‌న‌సు గెలుచుకునేందుకు స‌మ‌యం వృధా చేయ‌క‌పోవ‌డ‌మే న‌యం. మ‌రీ నాన్చొద్దు. పాల‌కు పాలు.. నీళ్లీను నీళ్లు… తేలిపోయిన త‌రువాత చేసే చ‌ర్య‌లు చేసుకుంటూ పోవ‌డ‌మే. తీసుకునే నిర్ణ‌యాలు అమ‌లు చేస్తూ ముందుకు సాగ‌డ‌మే.

You missed