(దండుగుల శ్రీనివాస్)
బీజేపీకి బీఆరెస్ అవసరం. బీఆరెస్‌కు బీజేపీతో పొత్తు అనివార్యం. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. విలీనం ఉత్త ముచ్చటే. ఇన్నేండ్లు అధికారాన్ని అనుభవించి .. పార్టీ ఫండే వేల కోట్లను కూడబెట్టుకున్న బీఆరెస్.. తన ఉనికిని మొత్తం కాలరాసుకుంటుందా? అది జరగని పనే. కానీ పొత్తు మాత్రం అనివార్యం. పొత్తు పొడవాల్సిందే.ఇక్కడ తెలంగాణ బీజేపీ చేతుల్లోకి పోవాల్సిందే. దీనికి బీఆరెస్ సపోర్టు కూడా కావాల్సిందే. అందుకే కేటీఆర్‌ను సీఎం చేసి.. హరీశ్‌ను కేంద్ర మంత్రిని చేసేస్తే.. దక్షిణ తెలంగాణలో పాగా వేసినట్టవుతుందని బీజేపీ అంచనాలు వేస్తోందా..? దీనికి బీఆరెస్ కూడా సై అంటే సై అంటుందా..? ఇదే జరగబోతుందని జోస్యం చెప్పారు విజయక్రాంతి పత్రిక చైర్మన్ సీఎల్ రాజం. తన పత్రికలో పతాక శీర్షికన రాసిన వ్యాసం ఆసక్తికరంగా ఉంది. నిజాలు లేకపోలేదు. ఆయన అంచనాలు అన్ని జరుగుతాయని కాదు.. పొత్తు మాత్రం తప్పదు. అదీ ఎన్నికలకు ముందే.. అనే అంశం కుండబద్దలు కొట్టారు.
విశ్లేషణ లోతుగానే ఉంది. వాస్తవికతను దగ్గరగానే ఉంది. ప్రాక్టికల్‌గా అది వందశాతం జరుగుతుందా? అనేది మనం ఇతమిత్థంగా ఏదీ చెప్పలేం. అదే రాజకీయం. కానీ ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి ఒంటరిగా పోటీ చేసి గెలిచే సీన్ లేదనేది మాత్రం నిజం. అట్లనే బీఆరెస్ కూడా సింగిల్‌గా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకునేంత వాతవారణం లేదు. అందుకే ఈ రెండూ పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాయి. ఇదెప్పటి నుంచో వినవస్తున్న వార్తే కదా..? మరి కొత్తేం ఉంది…. కవిత ముందే చెప్పింది. ఇదే కారణంతో ఆమె పార్టీ నుంచి బయటకు కూడా వచ్చింది. వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉంది.
కేసీఆర్ కూడా డిసైడ్ అయిపోయాడు. ఆయనకు కావాల్సింది అధికారం. కేటీఆర్‌ను సీఎం చేయడం. అంతకు మించి పెద్ద లక్ష్యాలేమీ లేవు ఆయనకు రాజకీయంగా. తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాటిచ్చి… షరతులు వర్తిస్తాయని బ్లాక్‌మెయిలింగ్ చేయడమూ ఆయనకూ చెల్లింది. అది చరిత్ర. అందరికీ తెలిసిందే. ఇక్కడా బీజేపీతో షరతులు వర్తిస్తాయి.. అనే కండిషన్ పెట్టనే పెడతాడు. అది కేటీఆర్‌ను సీఎం చేయడమే ప్రధాన కండిషన్‌లో ప్రధానమైనదిగా ఉంటుంది. అది కూడా అందరికీ తెలుసు. కానీ బీజేపీ అందుకు ఒప్పుకుంటుందా? అప్పటి రాజకీయ అవసరాలు, వాస్తవ పరిస్థితులు, అధిష్టానం ఆదేశాలు పాటించకతప్పదేమో..? ఇక రాజం చెప్పిన విశ్లేషణలో.. గోడ మీద పిల్లి వాటంలా.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత .. పరిస్థితిని బట్టి బీజేపీతో కలుద్దామనే కేసీఆర్ ఆలోచన వర్కవుట్ కాదనేది. కచ్చితంగా వీరి కలయిక ఎన్నికలకు ఏడాది ముందే ఉంటుందనే స్పష్టత. అలా చేస్తేనే తప్ప రావాల్సినంత మైలేజీ రెండు పార్టీలకు వస్తాయనే సమీకరణలు.
ఇది బాగానే ఉంది. కానీ ముస్లింల ఓట్లు… బీఆరెస్‌కు పడవచ్చనే అంచనే రాంగ్. బీజేపీతో అంటకాగిన తరువాత… ముస్లింలు ఇక బీఆరెస్ వైపు ఎందుకు చూస్తారు…? గెలిచే పార్టీ కాబట్టి… బీజేపీ వైపు కూడా ముస్లింలు ఉండి ఓటేశారనే సమీకరణ ఇక్కడ పనిచేయదు. షాదీ ముబారక్, ముస్లింలకు కేటాయించిన నిధులు, సంక్షేమ పథకాలు చూసి బీజేపీతో కలిసి ఉన్నా.. బీఆరెస్‌కే ఓటేస్తారనే సమీకరణ రాంగే. ఎందుకంటే.. బీఆరెస్‌కు ముస్లిం ఓట్లు అవసరం. లౌకిక పార్టీగా.. కాంగ్రెస్ బలంగా లేని సమయంలో ఆ ప్లేస్ ఆక్రమించేందుకు చేసిన కార్యక్రమాలు బీఆరెస్‌కు కలిసి వచ్చాయి. అప్పుడు అది బీఆరెస్‌కు అవసరం, ముస్లింలకూ అవసరం. కానీ ఇదే దృష్టిలో పెట్టుకుని మళ్లీ కేసీఆర్ వెంటే ముస్లింలు ఉంటారనే వాదనలో పసలేదు. మొత్తానికి కేటీఆర్‌ను సీఎం చేసేందుకు… కేసీఆర్‌కు బీజేపీతో దోస్తీ కట్టకతప్పదనేది నిర్వివాదాంశం. ఇదే చెప్పారు రాజం. ఏమో గుర్రం ఎగరానూ వచ్చు…
Dandugula Srinivas
Senior Journalist
8096677451