(దండుగుల శ్రీనివాస్)
కండ కలవాడేను మనిషోయ్! అన్నాడు గురజాడ. కానీ ఇప్పుడు కండల్లేవు. అన్నీ పొట్టలే. సిక్స్ ప్యాక్ దేవుడెరుగు.. కనీసం కొవ్వులేకుండా శరీరం లేదు. కొలస్ట్రాల్ ను పెంచి పోషించే గనిలా తయారు చేసుకున్నాడు మనిషి. మేం చేసేది పౌరోహిత్యం… ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదేమిటండీ..! అని బ్రహ్మీ అదుర్స్ సినిమాలోని డైలాగ్ ఫేమస్. కానీ ఇక్కడ అంతా పౌరోహిత్యమే చేస్తున్నారు. అంటే కడుపులో చల్ల కదలకుండా చేసే పనే అన్నట్టు. కాయకష్టం మాట మరిచాడు.
చమటోడ్చి సంపాదించడమంటే ఇక ఇప్పటి తరం నుంచి వినరావడం కష్టమే. వాకింగ్ లేదు. జాగింగ్ అసలే లేదు. బానలా పొట్ట పెరుగుతూ ఉంటే బాధపడే బదులు.. అదే మన డెవలప్‌మెంట్ అనుకుంటే సరిపోలా.. అవును అక్కడిదాకా వచ్చాం మనం. అల్ప సంతోషులం కదా. నువ్వు, నేను.. వాడు వీడు అని కాదు అంతా ఇప్పుడు ఈ జాతే. ధనవంతుడు, పేదవాళ్లు.. ఈ రెండే వర్గాలు ప్రపంచంలో అన్నారు. ఇప్పుడు కొంచెం పొట్టున్నవాడు.. బానెడు బొర్రున్నవాడు అని వర్గాలు విడదీయాలె తప్ప.. సన్నగా, బక్కగా, నాజుగ్గా, స్లిమ్ముగా, సిక్స్ ప్యాక్ లాంటి మాటలు చెప్పుకోవడానికే. ప్రాక్టికల్‌గా అవి ఇక మనకు సూటవ్వవు. సరే, ఇప్పుడిదంతా సోదెందుకంటే.. ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది ఫ్యాషన్ ఇండస్ట్రీ.
మరి ఇది యాపారం. వ్యాపారంలో నాలుగు రాళ్లు సంపాదించాలంటే.. ట్రెండ్ ఎటు పోతే మనమటు. జనం ఎట్లుంటే మనం వాళ్లతో పాటు. అందుకే పొట్టతో ఉన్నవారికీ మంచిగా నప్పేలా వెరైటీ మోడల్స్, డిజైన్స్‌ను మార్కెట్లోకి దించుతుంది ఫ్యాషన్ ఇండస్ట్రీ. అదీ లెక్క. మరి వాళ్లంతా మనదారికి రావాలె గానీ, మనం తగ్గొద్దు. పొట్ట అస్సలే తగ్గించుకోవద్దు. షుగన్, బీపీ, కొలెస్ట్రాల్‌కు మందులున్నాయిగా. వారూ బతకాలిగా. అంతేనంటారా!