(దండుగుల శ్రీనివాస్)
ఇక ముసుగులో గుద్దులాటెందకున్నారో ఏమో! మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లంతా చేస్తున్నదిదే కదా అని కూడా డిసైడయిపోయి ఉంటారేమో!! ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలే కదా పనిచేసేటివి.. ఇక జర్నలిజం.. నిబంధనలు, విలువలు, వలువలు…. ఇదంతా ఒట్టి ట్రాష్ అని కొట్టిపారేశారు కూడా. ఇది కదా ఓపెన్ మైండ్ అంటే. ఇది కదా ప్రాక్టికల్ నాలెడ్జీ అంటే. ఇదే కదా శాస్త్రీయ దృక్పథనాకి పరాకాష్ట అంటే. ఉన్నదున్నట్టు ఉండదు కనికట్టు…ఇది మాములుగా మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియానో, టీవీ చానెళ్లో వాడుకుంటాయి. కానీ దీని సారాంశాన్ని మాత్రం కాచి వడబోసి గటగటా తాగేసింది టీడీపీ. టీడీపీ నాలెడ్జ్ సెంటర్, తెలుగు దేశం కేంద్ర కార్యాలయం, మంగళగిరి నుంచి ఓ ప్రకటన వెలువడింది.
ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనుభవజ్ఞులై ఉండాలట. అనలిస్టులు కావాలట. సమకాలీన రాజకీయ అంశాలపై సమర్థ విశ్లేషణలు అందించాలట. సరళమైన తెలుగుపై పట్టు ఉండాలట. సంక్షిప్త రూపంలో భావ వ్యక్తీకరణ చేయగల సమర్థత కూడా కావాలటోయ్.. మరి ఇన్ని తెలిసి ఉన్నోడు, తెలివి ఉన్నోడు.. సీనియర్ జర్నలిస్టే అయి ఉండాలె. వేరే వాళ్లకు అంత సీన్ లేదు. ఇది మాత్రం కన్ఫాం. కానీ, లాస్ట్‌కు ఓ చిన్న కండిషన్ పెట్టాడండోయ్..అదే ఇక్కడ కొసమెరపు. తెలుగు దేశం పార్టీపట్ల నిబద్ధత, రాజకీయ అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టులు, అనుభవజ్ఞులు దరఖాస్తు చేసుకోవచ్చు.. అని మెలిక పెట్టాడు.
అసలు ఇదే ప్రధానమైన కండిషన్ కూడా. మరి అన్నీ ఓపెన్‌గా చెప్పేసిన సదరు టీడీపీ వారి ప్రచురణ కర్త .. ఈ జర్నలిస్టు అనే పదాన్ని కూడా మార్చేసి ఉంటే.. కొంచెంలో కొంచెం ఊపిరి తీసుకుంటూ కొన ఊపిరితో ఉన్న జర్నలిస్టును బతికించి ఉండేదేమో! మరైతే ఏం పేరు పెట్టమంటారు. అదే అందరికీ తెలిసిందే కదా.. అదేనండీ ఎర్నలిస్టు అంటే సరిపోయేది కదా. కాదా?
చివరగా ఏమనిపించిందంటే…. ఈ దరఖాస్తులకు, వారి నిబంధనలకు సరిగ్గా సరిపోయేటోళ్లు… అదేనండీ సీనియర్ జర్నలిస్టులు ఒక్క ఈనాడు పేపర్లో తప్ప వేరే చోట ఉండరేమో అనిపించిందంటే నమ్మండి. వారే.. వీరికి సరిగ్గా న్యాయం చేయగలుతారని నా ప్రగాఢ, ప్రబల విశ్వాసం. కాదంటారా?