(దండుగుల శ్రీనివాస్)
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఓ ఇంటర్వూలో అన్నాడిలా. నా కూలీ సినిమా ఎన్ని వేల కోట్లు తెచ్చిపెడుతుందో చెప్పలేను గానీ .. థియేటర్‌కు వచ్చి రూ. 150 పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడికి మాత్రం కనువిందు చేస్తాను. ఆ అమౌంట్‌కు గిట్టుబాటయ్యేలా సినిమా తీస్తానని. కానీ ఇక్కడ ఈ కూలీ సినిమాకు కూలీ గిట్టుబాటు కాలే. పెట్టిన టికెట్‌కు సరిపడా కాదు కదా.. సగం ధర కూడా కూలీ పడలే. అవును. అంత ఘోరంగా తీశాడీయన. ఓ ఖైదీ, ఓ విక్రమ్ సినిమాలతో పోల్చితే చాలా తీసికట్టు.. నేలబారు సినిమాగానే మిగలనుంది కూలీ సినిమా. భారీ తారాగణం.. నాగ్ కొత్తగా విలనిజం.. ఉప్పి, అమీర్.. తో పాటు లోకేశ్ స్క్రీన్ ప్లేపై భారీ అంచనాలుండే.
కానీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. పేలవమైన కథ, నేలబారు కథ… శవాలను కాల్చే చిల్లరమల్లర కథ… ఈ కథను అల్లుకునే క్రమంలో హీరోకూ చాలా సందర్భాల్లో క్రేజ్ తగ్గింది. విలువ పడిపోయింది. విలనీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అసలు ఈ డైరెక్టర్లే ఎందుకు కథలు రాసుకుంటారో తెలియదు. లోకేశ్ రాసుకున్న కథ.. కథనం.. డైరెక్షన్.. అబ్బా చెప్పొద్దు.. పరమ రొటీన్ .. బోర్ అండ్ బోర్..! రాసుకున్న కథలో, అల్లుకున్న స్క్రీన్ ప్లేలో చాలా లోపాలున్నాయి. సంగీతం, పాటలు పంటికింద రాయిలాగే. బీజేఎంతో హడలెత్తించి, రజినీని ఆకాశికెత్తేందుకే పనికొచ్చిందా లొడబిడ సౌండ్. ఉపేందర్, అమీర్‌ఖాన్ పాత్రలు… రజినీని జాకీలు పెట్టి లేపేందుకు ఉపయోగపడేవి. వారివి మాత్రం ఈ సినిమాలో కరివేపాకు పాత్రలు.
ఫ్లాష్ బ్యాక్‌లో ఆ రజినీ ఫేసు గ్రాఫిక్స్ మరీ పేవలంగా, ఎబ్బెట్టుగా ఉంది. ఓ కూలీ.. అంత పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చేయడం ఓ అతిశమైతే, షరా మామూలుగా ఆ కూలీకి అతీతశక్తులు అపాదించి … రాసుకున్న కథ పరమ రోటీనే. సెంటిమెంట్ పండలేదు సరికదా… శుభంకార్డు పడేసినా ఇంకా జనం ఏదో చెబుతారేమో.. ఇంకా ఏదో ట్విస్ట్ ఉంటుందేమో అని ఎదురు చూశారు. ఏం ట్విస్టులు లేవు.. క్లైమాక్స్‌లో. అబ్బ… మరీ ఇంత పరమ రోటీన్.. రొడ్డ కొట్టుడు.. బోరింగ్ , చెత్త సినిమా ఇంకొకటి ఉండదనుకుంటా లోకేష్ డైరీలో.
Dandugula Srinivas
Senior Journalist
8096677451