(దండుగుల శ్రీనివాస్)
పదహారు నెలల సుధీర్ఘ విచారణ తరువాత కాళేశ్వరంపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. కమిషన్ ఇచ్చిన సుధీర్ఘ నివేదికను.. సుధీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరించింది తెలంగాణ సర్కార్. సంక్షిప్తంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించింది ప్రభుత్వం. ఏతావాతా తేలిందేమిటంటే.. ముందు అంతా అనుకున్నదే. ఆయనే అన్నిటికీ సుప్రీం. తనో సగం ఇంజినీరు అవతారం.. తను చెప్పిందే వినాలి. అంతే. అక్కడా అదే జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టుగా ఊరు మార్చాడు. పేరూ మార్చాడు. అంచనాలూ మార్చాడు. ఇలా లక్ష కోట్ల ప్రాజెక్టు దుర్వనియోగమయ్యేందుకు కారణమయ్యాడు.
PRESS_JUDICIAL COMMISSION_report PPT ON JC-04.08.2025_FInal
ప్రజాధనం దుర్వినియోగం చేసి దోషిగా నిలిచాడు. ఒక్క విషయం కాదు రెండు కాదు… వందలల్లో తప్పులు, నిర్లక్ష్యాలు, అవినీతి, అక్రమాలు.. పర్యవసానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా నిలిచిపోయింది. కాళేశ్వరరావు అని తనను అంతా ముద్దుగా పిలుచుకుంటున్నారని ఉబ్బిపోయాడు. మురిసిపోయాడు. కానీ ఇప్పుడు విచారణ నివేదిక ఇచ్చిన దానికి ప్రకారం ఈ కాళేశ్వరరావు కటకటాలపాలు కావాల్సిందే. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన రుణాలు.. అవీ ఎక్కువ మిత్తీకి.. అసలు, మిత్తీ కలిపి రూ. 1.09 లక్షల కోట్లు. ఇప్పుడు జనం మీద ఉన్న గుదిబండ అది. ఈ సర్కార్ కట్టాల్సిన భారీ రుణమిది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దివాళా తీయించే అతి పెద్ద స్కాంను తలపించే ప్రాజెక్టు ఇది.

మరి చర్యలింకెప్పుడు? అనేదే మిగిలుంది. త్వరలో దీనిపైనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్. ఈ సమావేశాల్లో అందరి సభ్యలు వివరణలు, సలహాలు తీసుకుంటామన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యగా సర్కార్ ముందుకు పోవడం లేదన్నారు. ఒక పద్దతి ప్రకారం, చట్టాన్ని నిబంధనలను అనుసరించి తదుపరి చర్యలుంటాయని తెలిపారు. మొత్తానికి కాళేశ్వరం కథ కంచికి చేరింది. ఇక కాళేశ్వరరావే కటకటాలకు చేరాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఓ చారిత్రక తప్పిద ప్రాజెక్టుగా చరిత్ర కెక్కింది.
