ఢిల్లీ- వాస్తవం:
బనకచర్లకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సంస్థలు స్పందించి అభ్యంతరాలు చెప్పినందున ఆ అంశమే ప్రస్తావనకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసి అన్యాయం చేశారని.. వాటిని పరిష్కరించడానికి విధివిధానాలను ముందుకు తీసుకువచ్చామని అన్నారు. జల్‌శక్తి కార్యాలయంలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడారు.
టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం తెలంగాణ విజయమని రేవంత్ రెడ్డి తెలిపారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. సుహృద్భావం వాతావారణం చెడిపోతే బాగుండునని కొంతమందికి ఉందని… ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటే తమకు బాగుంటుందని వాళ్లు అనుకుంటున్నారని… వారిని చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేమని బీఆరెస్నుద్దేశించి ఎద్దేవా చేశారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా బీఆరెస్ ఏ సమస్య పరిష్కరించలేకపోయిందని.. వాళ్ల దుఃఖాన్ని, బాధను తాము అర్ధం చేసుకుంటామని విమర్శించారు.
బీఆరెస్‌కు సమాధానం ఇవ్వడానికి తాము లేమని, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా తామున్నామని.. పరిపాలన ఎలా చేయాలో తమకు తెలుసని సీఎం తెలిపారు. వివాదాలు చెలరేగకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చూపడం తమ బాధ్యతని సీఎం తెలిపారు.