(దండుగుల శ్రీనివాస్)
ఎన్నో రోజుల నుంచి ఎదురుచూపులు. ఆయన ఇందూరు రావడమే ఒక గగనం. రప్పించడం ఒక అద్భుతం. అది అర్వింద్ చేశాడు. అమిత్ షా వస్తున్నాడంటే ఇందూరులో అదో ఉత్సాహం. కదలిక. పార్టీకి మరింత ఊపు తెచ్చిపెట్టే కార్యక్రమమని అంతా తలిచారు. పేరుకు పసుపు బోర్డు ఆఫీసు ఏర్పాటు.. కార్యాలయ ప్రారంభం అంతా ఒక రకంగా రాజకీయమే. ఎందుకంటే పసుపుకు మద్దతు ధర ఇవ్వని ఆ బోర్డు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఆ విషయం పసుపు రైతులకు తెలుసు. అందుకే దీనికి పెద్దగా ప్రయార్టీ ఇవ్వలేదు. కానీ అమిత్ షా బహిరంగ సభలో కాంగ్రెస్‌ను ఏకిపారేస్తారని అంతా అనుకున్నారు.
కేసీఆర్, బీఆరెస్ ఒడిసిన ముచ్చట. ఇప్పుడు బీజేపీ.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండాలనుకుంటున్నది. ప్రజలకు అదే మెసేజ్ పోవాలనుకుంటున్నది. అందుకే ఇందూరు వేదికగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఏకిపారేద్దామనుకున్నది బీజేపీ. అందుకు అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభం… తదుపరి బహిరంగ సభను ఓ వేదిక చేసుకుందామనుకున్నది. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకు..? రేవంత్ ముందే పసిగట్టాడు. అందుకే శషభిషలు లేకుండా, ఇగో ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఇద్దరు మంత్రులను పంపాడు. తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఇద్దరు మంత్రులు దీనికి హాజరుకావడం బీజేపీ శ్రేణులను కూడా అవాక్కు చేసింది. దీంతో ముందు అనుకున్న ప్రసంగం మారింది. అమిత్‌షా సైలెంట్, కామ్ గోయింగ్ ప్రసంగం మాత్రం రిలీజ్ అయ్యింది. ఇదీ స్క్రిప్టెడే. అందుకే అలా వచ్చి అలా వెళ్లిపోయాడు అమిత్ షా. కాకలు తీరిన అమిత్ షా వ్యూహాలకు కూడా చెక్ పెట్టగలిగాడు రేవంతు.