(దండుగుల శ్రీనివాస్)
అసలు ముచ్చట చెప్పుమంటే మళ్లీ మళ్లీ గవే ముచ్చట్లు. అప్పులు జేసిండు పోయిండు. రాష్ట్రాన్ని వల్లకాడు జేసిండు. పోయిండు ఫామ్ హౌజుల పన్నడు. ఆయన నోటి నుంచి గా ముచ్చట ఎప్పుడొస్తదా అని ఇందామంటే.. చెప్పిందే చెప్పిండు. అరే మాకే అవన్నీ కంఠతా వచ్చేసినయంటే.. నమ్ముండ్రి. గతంగనం అరిగిపోయిన గ్రామఫోను రికార్డు లెక్క చెవులల్లకెల్లి నెత్తరొచ్చేదాకా ఇడసపెట్టలే. చెప్తే చెప్పిండు కానీ చివరాఖ్రికీ గా ముచ్చట కూడా చెప్పిండు. గదే మనమందరమూ ఎదురుచూసింది. రైతు భరోసా ఏస్తమన్నడు. ఇయ్యాలసంది. తొమ్మిది దినాలల్ల తొమ్మిదివేల కోట్లు అంట.
అందరికంట. ఇన్నెకరాలు అన్నెకరాలు అని కాదంట. అబ్బ ఎంత చల్లటి మాట చెప్పినవయ్యా ఇప్పటికైన. భరోసా ఏసి బతికించినవ్ పో. అదేందీ..? అంత మాటన్నవ్..! అవ్ మల్ల. ఆ పైసలెప్పుడొస్తయా అని దినం సచ్చుడే అయింది. ఒకలు రేపు అంటరు. ఇంకొకలు మాపు అంటరు. ఇగో నాలుగు నెలలైతుంది కొందరికే ఏసి. ఇప్పుడు అందరికీ అంటున్నరు. అంటే అప్పుడు రానోళ్లకు అంతేనా. ఇది కొత్త లెక్క గావొచ్చు. ఎహె.. ఏదో ఒకటి తియ్. పడనైతే పడుతున్నయ్ కదా. పడతయ్. పడతయ్. కచ్చితంగా.
అవునుగానీ గా చివర్ల ఎవుసం మంత్రి ఏడు దినాల్లో మొత్తం ఏస్తమన్నడు. మరి సీఎంసాబేమో తొమ్మిది దినాలన్నడు. మళ్లా పాతముచ్చట చేయరు కదా. అరే నీకన్నీ అనుమానాలే. రెండొద్దులు అటూ ఇటూ ఏస్తరు. ఇన్ని రోజులు ఆగినవ్.. ఇప్పుడు ఆగుతలేదా…! ఆ ఆగపోతే చేసేదేముంది..? మొత్తమే ఎయ్యకపోతే అడిగేదేముంది..?