(దండుగుల శ్రీనివాస్)
పాపం పెద్దాయన. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడు. చేయనని కూడా చెప్పేశాడు. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బోధన్‌లో షకీల్‌పై గెలిచాడు సుదర్శన్‌రెడ్డి. వస్తదా..? రాదా..?? అనుకున్నా.. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. అబ్బ తంతే బూరలో బుట్టలో పడ్డట్టు తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నాడు. అందులోనూ సీఎంగా రేవంత్‌రెడ్డే ఉండే. దగ్గరి బంధుత్వం ఉండనే ఉంది. ఇక తనకు తిరుగులేదనుకున్నాడు. మంత్రివర్గంలో రెడ్లు ఎక్కువయ్యారని ఈ పెద్ద మనిషిని ఫస్ట్ లిస్టులో పెట్టకుండా పెండింగ్‌లో పెట్టేశారు. ఇక రేపు మాపు అంటూ, సమీకరణలు, సంప్రదింపులంటూ ఏకంగా రెండేండ్ల కాలం హారతి కర్పూలంగా కాల్చేశారు. ఇంకా తేల్చరు. అదే నాన్చు డు.
తనిప్పుడు అన్ అఫిషియల్ మంత్రే. అదే ప్రొటోకాల్ పాటిస్తున్నారు నిజామాబాద్ అధికార యంత్రాంగం. అయినా అది కాదు కదా మజా. మంత్రి పదవి ఉండాలె. ఆ హోదా రావాలె. ఇంకా రాదే. ఎప్పుడు.. ఇగ ఇప్పుడు.. చూసీ చూసీ కళ్లు కాయలు కాచి.. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు.
పాపం పెద్దాయన. ఏదండీ ఆయన రాజకీయ జీవిత చరమాంకంలో ఈ ఉసురు తీసే కార్యక్రమాలు. ఏదో తొందరగా ఆ సెకండ్ లిస్టు ప్రకటించేయరాదు.. ప్లీజ్.. ప్లీజ్…! మీ లెక్కలు బొక్కలు చిక్కులు దిక్కులు చుక్కలు తేలకపోతే… కనీసం రెండో లిస్టులో కేవలం కేవలం మా పెద్దాయన పేరైన పెట్టి విడుదల చేయండి. ప్రమాణం చేయించండి.. నాకు తెల్వక అడుగుతాను.. మీకు కనీసం పాపం అని కూడా అనిపించడం లేదా.. ఆ ముసలాయనను చూసి.. ! ఛీ ఛీ మరీ ఇంత కఠినాత్ములా..? అవును మీది కాంగ్రెస కదా..!! కాంగ్రెస్‌లో అంతే.. కాంగ్రెస్‌లో అంతే..!
