(దండుగుల శ్రీనివాస్)
సామాజిక సమీకరణలకు పెద్ద పీట వేస్తోంది అధిష్టానం. అందుకే మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమవుతోంది. కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని, మోడీ కూడా మమ్మల్ని ఫాలో కాక తప్పలేదని చెప్పుకుంటున్న కాంగ్రెస్… తెలంగాణలో మంత్రివర్గ విస్తరణలో కులాల సమీకరణలు పాటించకపోతే అందరి చేత విమర్శల పాలు కావడం ఖాయమని భావిస్తోంది. అందుకే రెడ్డి కాంగ్రెస్‌గా ముద్రపడ్డ తెలంగాణ సర్కార్‌లో ఆ రెడ్డి పాత్రను కాస్తైన తగ్గించాలని అనుకుంటున్నది. అందుకే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఓ రెడ్డికి చెక్ పెట్టింది. ఆ రెడ్డి పేరే మల్రెడ్డి రంగారెడ్డి.
అన్ని రకాల ప్రయత్నాలు.. ఇది చిన్న పదమే అవుతుంది… విశ్వప్రయత్నాలు చేసి తనకు కచ్చితంగా మంత్రి పదవి రావాల్సిందేనని పట్టుబట్టి, బ్లాక్‌మెయిలింగ్‌కు కూడా వెనుకాడని మల్‌రెడ్డికి ఊహించని విధంగా షాక్ ఇవ్వనుంది అధిష్టానం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఏకైక ప్రజాప్రతినిధి నేనేనని.. రేపు గవర్నమెంట్ ఏర్పాటులో కూడా ఇక్కడి భాగస్వామ్యమే ప్రధాన భూమిక పోషించనుందని, మమ్మల్నే విస్మరిస్తే మీ సంగతులు అంతేననే విధంగా విస్తృత ప్రచారం చేస్తూ వచ్చాడు మల్రెడ్డి. దీనికి మాంచి విరుగుడు కనిపెట్టారు అధిష్టానం.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా వివేక్ ఒత్తిడిని తప్పించుకుని.. అతనిపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా మంత్రి పదవి ఇవ్వలేమని చెప్పేందుకు ఓ కారణం వెతుక్కోవడంతో పాటు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకే వచ్చే వికారాబాద్ ఎమ్మెల్యే , స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మంత్రివర్గంలో చోటివ్వాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎస్సీ కోటాలో వివేక్ ఇచ్చే బదులు అదే కోటాకు చెందిన గడ్డం ప్రసాద్‌కు మంత్రివర్గంలోకి తీసుకుని.. వివేక్‌కు స్పీకర్ పదవి ఇవ్వాలని భావిస్తోంది. అదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి నుంచి గడ్డం ప్రసాద్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది కాబట్టి.. మల్‌రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పనుంది.