(దండుగుల శ్రీ‌నివాస్)

కాంగ్రెస్ అంటే అంతేమ‌రి. ఒకే ఇంట్లో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులా..? అని ఎంత మంది గ‌గ్గోలు పెట్టినా అదే జ‌ర‌గ‌బోతుంది. కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్య‌మే. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మొత్తానికి సాధించాడు. మంత్రివ‌ర్గంలో అత‌నికి చోటు ల‌భించిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఇవాళ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఖ‌ర్గే అందుబాటులో లేక‌పోవ‌డంతో అది ఎల్లుండి బుధ‌వారానికి వాయిదా ప‌డింది.

అనుకున్న‌ట్టుగానే పాత‌పేర్లే ఫైన‌ల్ కానున్నాయి. మ‌క్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీ‌హ‌రి, ఎస్సీ కోటాలో వీ6 అధినేత వివేక్ వెంక‌ట‌స్వామీ, బోధ‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్‌రెడ్డితో పాటు రాజ‌గోపాల్‌రెడ్డి పేర్లు ఖారారైన‌ట్టు స‌మాచారం. దీనిపై బుధ‌వారం అధిష్టానం ఆమోద‌ముద్ర వేయ‌నుంది. రాజ‌గోపాల్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని గ‌ట్టి ఒత్తిడే కొన‌సాగినా.. మొత్తానికి అత‌ని పేరునే ఫైన‌ల్ చేసింది అధిష్టానం.

రాజ‌గోపాల్‌రెడ్డి స్థానంలో ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరును తెర‌పైకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రివ‌ర్గంలో ఎలాంటి ప్రాతినిథ్యం లేక‌పోవ‌డంతో మ‌ల్‌రెడ్డికి ఇవ్వాల‌నే డిమాండ్ కొన‌సాగింది. అత‌ను కూడా లాబీయింగ్ గ‌ట్టిగానే చేశాడు. కానీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఒకే ఇంట్లో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఖాయ‌మై పోయాయి. కాంగ్రెస్‌లో అంతే. కాంగ్రెస్‌లో అంతే.