(దండుగుల శ్రీనివాస్)
ఈ కార్ రేసింగ్ అవినీతి అంటు కొన్ని రోజులు ఎపిసోడ్స్ లాగించిర్రు. కేటీఆర్ ఇగో అరెస్టు అగో అరెస్టంటూ జనాలను పిచ్చోళ్లను చేసిర్రు. ఇప్పుడది అంతా మరిచిపోయిర్రు. ఏమన్నా అంటే మేము అరెస్టు చేయనీకి అధికారంలోకి వచ్చినమా..? మాకు పాలన ముఖ్యం అన్నాడు. ఇప్పుడు మళ్లీ కొత్త కత ఎత్తుకున్నాడు. కాళేశ్వరం కహానిలో మెయిన్ విలన్ కేసీఆర్. అందుకే కమిషన్ నోటీసులిచ్చింది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు మీడియా ఒక్కటే సప్పరిస్తుంది ఈ వార్తను. సారొస్తడా..? హాజరైతడా..? రాకపోతే ఎట్లా..? ఇదెక్కడదాక పోతది..?? ఎటూ పోదు.
కొన్ని రోజులు గుంజి గుంజీ బజార్ల పెట్టి కేసీఆర్ పరువు తీస్తందుకు మస్తు పనికొస్తది కాంగ్రెసోళ్లకు. అదే అనుకుంటున్నరంతా. కానీ ఈసారట్ల కాదు. గట్టిగానే ఉంటది యాక్షన్ అని అంటున్నారాళ్లే. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలె. తన పేరునే కాళేశ్వరరావు అని పిలుపుచ్చుకుని సంబరపడ్డ కేసీఆర్కు … ఆ మానసపుత్రిక ప్రాజెక్టులనే దొంగను చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది సర్కార్. ఎంత బాధైతుండొచ్చు కేసీఆర్కు. జాతిపితకు ఎంతటి ఖర్మ పట్టెరా అనుకుంటున్నరు ఆయన్ను అభిమానించెటోళ్లు. ఒక్క ఒక్క పిల్లర్ కుంగింది. గంతే. ఇగ దీనిమీద ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేసి చేసి ఆఖిర్కి పెద్దసారుకే నోటీసులు పంపేదాక తెచ్చిండ్రు.
అయినా ఒక్కటి మాత్రం నిజం. ఇవిప్పుడు జనానికి పెద్దగా ఎక్కడం లేదబ్బి. ఆళ్ల బాధలాళ్లకున్నయి. వీళ్లబాధలు వీళ్లకున్నయి. అంతే ఎవరి పని వాళ్లు చేసుకుంటుండ్రు. జనంతో సంబంధం లేకుండా. రాజకీయాలే ఊరిపిగా.