మైనంపల్లి హన్మమంతరావు… ఇప్పుడు టీఆరెస్ వర్గాలకు ఒక ట్రండ్ సెట్టర్. ఒక ఆపద్భాందవుడు.. ఒక ‘అర్జున్ రెడ్డి’. బండి సంజయ్‌ను బండ బూతులు తిట్టి ఒక రోజులోనే అపారమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాడు. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్లకు ఇతను ఓ ‘మగధీరుడు’. ‘అర్జున్ రెడ్డి’ ఫార్ములా వాడిచూసి సక్సెస్ అయిన మైనంపల్లిని మీడియా కూడా తమ సంచనాల కోసం భుజానికెత్తుకుని తిరుగుతున్నది.
ఇతర టీఆరెస్ నాయకులకు మన మైనంపల్లి ఆదర్శంగా కనిపించాడు. స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇతన్ని ఫాలో అవుదామని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లున్నారు. కానీ అందరి కంటే ముందు మన ‘ఆర్మూర్ జీవన్‌రెడ్డి’కి హన్మంత్‌రావు పూనాడు. అదే స్టైల్‌లో మన జీవన్‌రెడ్డి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ‘బిడ్డా..! అర్విందు నిన్ను బట్టలు విప్పి తిప్పుతా’నని అంకుశం సినిమాలో రాజశేఖర్ లెక్క అర్వింద్ పై విరుచుకుపడ్డాడు. టీఆరెస్ నాయకుల నుంచి గతంలో ఎన్నడూ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు రాలేదు. హన్మంతురావు దానికి ఆద్యుడిగా నిలిచాడు. జీవన్‌రెడ్డి దాన్ని అందిపుచ్చుకున్నాడు.
బండి సంజయ్, అర్వింద్‌లే కాదు మేమూ దిగజారగలమని నిరూపించుకున్నాడు. బూతుల రాజకీయ భాషకు బీజేపీ ప్రాణం పోస్తే.. మనవాళ్లు దాన్ని పరుగులెత్తిస్తున్నారు. ఇలాంటి భాష మాట్లాడమని జీవన్‌రెడ్డికి కేటీఆర్ చెప్పాడా? కేసీఆర్ అనమన్నాడా? లేక మనోడి అత్యుత్సాహమేనా? ఏదేమైనా మైనంపల్లిని ఫాలో కానున్నారు టీఆరెస్ నేతలు. ఇక రాజకీయ భాషలన్నీ బాలకృష్ణ సినిమాల్లో డైలాగుల్లా, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లా భీభత్సంగా, భయానకంగా ఉండబోతున్నాయి. ఇదో కొత్త ట్రెండు మరీ. మైనంపల్లా మజాకా.