(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప్ర‌తిప‌క్షం ఎలా ఉండాలి? జ‌న‌మేమి కోరుకుంటున్నారు? ఈ స‌ర్కార్ నుంచి వాళ్లేం కోరుకుంటున్నారు? ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్ ఏం చేస్తోంది? ఈ విష‌యాలు గురించి మాట్లాడుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు … ఇద్ద‌రి ప్ర‌స్తావ‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. కేటీఆర్‌, క‌విత‌. అన్నాచెళ్లెళ్లిద్ద‌రు ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నారు. మొన్న‌టిదాకా వీరిద్ద‌రిదీ అధికార ప‌క్షం. ఇప్పుడు ఇద్ద‌రూ ప్ర‌తిప‌క్ష పాత్రే పోషిస్తున్నారు. ఆలోచ‌న‌ల్లోనే కాదు ఇప్పుడు వారి దారులు కూడా భిన్న‌మే. కేటీఆర్‌తో క‌విత‌ను పోల్చ‌డ‌మా..? ఆ పార్టీ ఎక్క‌డ‌? అస‌లు ఇంకా రూపే దాల్చుకోని క‌విత పార్టీ ఎక్క‌డ‌? అనుకోవ‌చ్చు. కానీ.. పార్టీ పెట్ట‌క ముందే ఆమె తెలంగాణ జాగృతి ద్వారా స‌క్సెస్‌ఫుల్ ప్ర‌తిప‌క్ష పోషించే క్ర‌మంలో ముందున్నారు. ఎవ‌రు కాద‌న్నా.. అవున‌న్నా!

పాత స‌ర్కార్ లోపాలు, పాపాలను, అవినీతి బాగోతాల‌ను బ‌య‌ట‌పెడుతూనే.. స‌ర్కార్ చేయాల్సిన ప‌నుల‌నూ గుర్తు చేస్తున్నారు క‌విత‌. ఇచ్చిన హామీల సంగ‌తేంట‌నీ ప్ర‌శ్నిస్తున్నారు. నిల‌దీస్తున్నారు. ఆందోళ‌న‌లు చేస్తున్నారు. రెండేండ్లైంది పింఛ‌ను ఎప్పుడు పెంచుతార‌ని ధ‌ర్నా చేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ఇవ్వాల్సిన 2500 ఆస‌రా ఎప్పుడిస్తార‌ని ప్ర‌జా భ‌వ‌న్ ముట్ట‌డిస్తున్నారు. బాధితుల ప‌క్షాన నిలుస్తున్నారు. జ‌నం నాడి తెలుసుకుని ఆ దిశ‌గా ఆందోళ‌న‌ల‌ను రూపొందిచుకుంటున్నారు. బ‌డ్జెట్‌లో విస్మ‌రించిన హామీల అమ‌లుకు నిధులు కేటాయించాల‌నే డిమాండును వినిపిస్తున్నారు. అంత‌కు మించి పార్టీ పాల‌సీగా ఉద్య‌మకారుల ఆత్మ‌గౌవ‌రం, బీసీ నినాదం తీసుకుని ముందుకు సాగుతున్నారు. మ‌రి బీఆరెస్ ఎందుకు వెన‌క‌బ‌డ్డ‌ది. కేసీఆర్ ఫామ్‌హౌజ్కు ప‌రిమితం కావ‌డం, కేటీఆర్‌కు కారు స్టీరింగ్ ఇవ్వ‌డం.. అంతా తానై కేటీఆర్ న‌డిపించ‌డంతో ఇప్పుడు అన్నాచెళ్లెళ్ల ప్ర‌తిప‌క్ష పాత్ర‌, వారు వెళ్తున్న విధానాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.

తిట్టుకు తిట్టే ప‌రిష్కారంగా, నువ్వు రెండంటే నేను ప‌దంటా అనే సిద్ధాంతానికి క‌మిట్ అయిపోయాడు కేటీఆర్. అందుకే సీఎం రేవంత్‌రెడ్డితో తిట్ల‌కు పోటీ ప‌డుతున్నాడు. నిత్యం రాజ‌కీయాల్లో ఇప్పుడు తిట్ల దండ‌కం విన‌డం జ‌నానికి విసుగొచ్చేసింది. ఈస‌డించుకుంటున్నారు కూడా. వాస్త‌వానికి, రెండేండ్ల‌లో ఈ స‌ర్కార్ పాల‌న‌లో ప్ర‌జ‌లేమీ ఆనందంగా లేరు. కేసీఆర్ అమ‌లు చేసిన ప‌థ‌కాలే పూర్తిగా అమ‌లు కావ‌డం లేదు. ఇక కొత్త‌వాటి ఊసే లేదు. మ‌రి ఈ స‌మ‌యంలో జ‌నం ఏం కోరుకుంటారు. మీ తిట్ల పురాణమా? ఎవ‌రెక్కువ తిట్టుకున్నారు. ఆ తిట్ట‌ను తిప్పికొట్ట‌డంతో మ‌రిన్ని ఘాటు తిట్ల‌తో ఎలా స్పందించారు? ఇవి కాదు కదా కోరుకునేది. క‌చ్చితంగా వీటినైతే జనం కోరుకోరు. తూ కిత్తా అంటే తూ కిత్తా అనేది కాదు జ‌నానికి కావాల్సింది. ఖ‌జానా ఖాళీ అనేది స‌ర్వ‌రోగ నివార‌ణ‌కు ప‌రిష్కారం కాదు. జనానికి వాటితో సంబంధం లేదు.

పెడ్తా అంటే ఆశ‌.. కొడ‌తా అంటే భ‌యం. మాన‌వుడి నైజ‌మ‌ది. పెడ‌తామ‌న్నారు. ఆశ‌లు పెట్టారు. అమిత‌మైన హామీలిచ్చారు. వాటిని వంద‌శాతం పూర్తి చేయ‌క‌పోవ‌చ్చు.. క‌నీసం వాటి దరిదాపుల్లోకి కూడా ఇంకా చేరుకోలేదు స‌ర్కార్‌. మ‌రి జ‌నం ఎలా సంతోషంగా ఉంటారు. మీ తిట్లు వింటూ .. అప్పుల చేసి ప‌ప్పుకూడు తింటూ ఉండాలా? మ‌రి ప్ర‌తిప‌క్షం ఏం చేయాల‌? ఎవ‌రేం చేస్తున్నారు. మంచిగైంది అనుభ‌వించ‌డ‌ని అన‌డం పైశాచిక‌మే అవుతుంది. ఇప్పుడు ఎన్నిక‌లేమీ లేవు క‌దా.. ఇంకా స‌మ‌యం ఉంది కదా అప్ప‌టి వ‌ర‌కు టైం చేద్దామంటే.. అది ప‌లాయ‌న‌వాదం, ప‌చ్చి అవ‌కాశ‌వాద‌మే అవుతుంది. మ‌రేం చేయాలి? ఇప్పుడు ఎవ‌రు ఏం చేస్తున్నారు? అదే జ‌నం చూస్తున్న‌ది.

Dandugula Srinivas

Senior Journalist

7661066999