(దండుగుల శ్రీనివాస్)
ముందుగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన గురించి, పార్టీ గురించి, పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పాలనిపించింది. అందరికీ తెలిసినవే అయినా. ముందుగా.. తాజాగా వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే .. నిజానికి ఆ పార్టీ జనంలో లేదు. నిర్మాణమూ లేదు. కానీ కేసీఆర్ ఉన్నాడు. ఆయనను చూసే ఓటేశారు. ఈ వచ్చిన ఫలితాలు ఆయన పునాదులే. పార్టీ నిర్మాణంపై కేసీఆర్ కూడా ఏనాడు శ్రద్ద పెట్టలేదు. ఆ తరువాత కొడుకు కేటీఆర్‌కు కారు స్టీరింగు అప్పగించిన తరువాత ఇంకా దారుణమైంది పార్టీ పరిస్థితి. ఇప్పుడు నానాటికీ మరింతగా దిగజారుతూ వస్తున్నది. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయలేదు. కేటీఆర్ కూడా పెద్దగా ప్రచారం చేయలేదు. కానీ ఓట్లు 25 శాతం నుంచి 30 శాతం రావడం మామూలు విషయం కాదు. ఇవి ఎట్లా పడ్డాయి. కేవలం కేసీఆర్ కేంద్ర బిందువుగానే. అవును.. ఎవరు కాదన్నా.. అవునన్నా… కేసీఆర్ ఇంకా జనం మనసులో ఉన్నాడు. కేటీఆర్‌ను సీఎం చేస్తానని ఏ ఎన్నికకు పోయినా.. ఆ వచ్చే ఓట్లు కూడా రావు. కేటీఆర్‌ను జనం అంగీకరించడం లేదు. ఆ విషయం కేసీఆర్‌కు తెలుసు. కేటీఆర్‌కూ తెలుసు. అందుకే ఆదిలోనే అప్పట్లోనే ఆ ఆలోచనను విరమించుకున్నాడు కేసీఆర్. కేటీఆర్ కూడా పదే పదే తన ప్రసంగాల్లో మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తాడు.. అనే జనానికి ఇంజెక్టు చేయడం వెనుక భయం.. భద్రత అంతా అదే. అందుకే ఇప్పుడు ఆ కేసీయారే గులాబీ పార్టీకి. గులాబీ దండుకు కేంద్ర బిందువు.
రాజకీయ చతురత ఎంత ఉన్నా.. తన లోపాలు, పాలనపరమైన విధానాలు, తప్పుడు నిర్ణయాలు.. ఇవన్నీ కేసీఆర్ను అధికారానికి దూరం చేశాయి. దీనికి తోడు ఆయనకు వ్యవస్థీకృత బలం లేదు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ అంతే. ఆయనే ఒక్కడు. ఒక్కడూ ఆయనే. వన్ మ్యాన్ షోగానే నడిపిస్తూ వచ్చాడు. తన వ్యక్తిత్వము, మొండితనమే చాలా సందర్భాల్లో ఆయనను నిలబెట్టింది. ఉద్యమానికి ఊపునిచ్చింది. ఆంధ్ర లాబీయింగ్ తరహాలో కేసీఆర్‌కు పెట్టుబడీవర్గం మద్దుతు లేదు. కులబలమూ లేదు. ఇక్కడ తెలంగాణలో వెలమల బలం ఆయనకు సరిపోలేదు. కానీ కేసీఆర్ తన వ్యక్తిత్వము, రాజకీయ చతురతతోనే అందరినీ దగ్గర చేర్చే ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమం ద్వారా అది నిరూపించుకుని, సాధించుకున్నాడు. కానీ కులబలం లేకపోవడం, పెట్టుదారీవర్గం వెనుక ఉండకపోవడం.. ఆది నుంచి ఆయనకు లోపమే. దీనికి తోడు రెడ్లు ఆయనతో ఎప్పుడూ కలిసిలేరు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోసం ఒకరికొకరుగా ఉన్నట్టుగా ఉన్నారే తప్ప.. ఆయనను రెడ్లు ఎప్పుడూ నమ్మలేదు. అదీ ప్రధాన లోపమే కేసీఆర్‌కు. కానీ ఆంధ్ర పాలకులకు అట్ల కాదు. కమ్మ లాబీయింగు బలంగా ఉంటుంది. వ్యవస్థలు బలంగా పనిచేస్తాయి వారి కోసం. పేపర్లు, చానెళ్లు కూడా పనిచేస్తాయి.
కానీ ఇక్కడ కేసీఆర్‌కు తనే ఓ పేపర్, చానెల్ పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ వాటినీ నడపలేని దుస్థితి. చివరకు ఆంధ్ర, కమ్మ లాబీయింగు ఎంత బలమైనదంటే.. మొన్నటి దాకా సీఎంవోలో వారిదే పెత్తనం. వారు చెప్పిందే వేదం. ఇప్పుడు ఈ లోపాలన్నీ కేసీఆర్‌కు శాపాలయ్యాయి. ముందే పార్టీ నిర్మాణం లేదు. వ్యవస్థాగతంగా దారుణంగా ఉంది పార్టీ పరిస్థితి. దీనికి తోడు కొడుకుకు చేతకావడం లేదు. కులబలమూ లేదు. పెట్టుబడిదారి వర్గమూ అంతా దూరం దూరం.. ఇక కేసీఆర్ ఒక్కడే దిక్కు. ఆయనకే ఇప్పుడు కేంద్ర బిందువు. నిన్నటి మున్సిపల్ ఫలితాలు.. కేసీఆర్‌ను బతికించుకునేందుకే ఓట్లేశారు అనేలా ఉన్నాయి. అంతే తప్ప అవి పార్టీ గురించి వేసినవి కావు. నిర్మాణంగా పార్టీ బలంగా ఉందనీ చెప్పే సంకేతము అసలే కాదు. ఇప్పుడు ఒకే ఒక చాయిల్, ఆధారం… కేసీయారే.
వ్యవస్థను ఇట్లనే పెట్టుకుని ఇలాగే ముందుకు పోతాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం అని కేసీఆర్, కేటీఆర్ అనుకుంటే అది జరగని పని. అధికారం వీరికి కనిపించనంత దూరంలోనే ఉంటుంది. పార్టీ పునాదులు ఇంకా ఉండటం ప్రస్తుతం బీఆరెస్‌కు ఊపిరిపోసే అంశం. ఆ ఒక్కటీ తప్ప.. అంతా నాశనం అయి కూర్చింది వ్యవస్థ. ఎక్కడ లోపాలు జరిగాయి? అని తెలుసుకుని ముందుకుపోవడం.. నిర్మాణం పట్ల శ్రద్ధ తీసుకోవడం, నిర్వీర్యమైన వ్యవస్థలను బలోపేతం మాటేమోగానీ, బతికించుకోవడం చేయకపోతే బీఆరెస్‌కు పూర్వవైభవం కల్ల. అధికారం ఓ కల. అంతే.

Dandugula Srinivas
Senior JOURNALIST
7661066999
