(దండుగుల శ్రీనివాస్)
బీఆరెస్, బీజేపీలు వేర్వేరు కావని, ఈ రెండు పార్టీలు బొమ్మ బొరుసులాంటివని, వీరిది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల కోసం వీరెన్ని వేషాలు వేసుకొచ్చినా.. దెబ్బకు దెబ్బ తీస్తామన్నారు సీఎం. ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చిత్తుగా ఓడగొడతామన్నారు.ఈ రెండు పార్టీలకు ఈ వేదిక మీదుగా సీఎం సవాల్ విసిరారు. చివరకు ఫలితాలు కాంగ్రెస్‌కు వందశాతం అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, చైతన్యవంతులైన ఓటర్లకు ఇది తెలుసునన్నారు. బీఆరెస్, బీజేపీది చీకటి బంధమని తాను పదే పదే చెబుతున్నది నిజమేనని చెప్పడానికి బీజేపీ డబుల్ స్టాండ్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు.
కాళేశ్వరంలో లక్ష కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్, హరీశ్‌ను సీఐబీ ఎందుకు ప్రశ్నించడం లేదని కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తే.. తాను సీఎంనా అరెస్టు చేయడానికి అంటూ మాట్లాడుతున్నారని.. మరి సోనియా, రాహుల్‌ను మీ జేబు సంస్థలుగా ఉన్న సీబీఐ, ఈడీ ఎందుకు వెంటాడి వేధిస్తున్నదని ప్రశ్నించారు. ఈకార్ రేస్ కేసులో కేటీఆర్‌ను కూడా రక్షిస్తున్నది కిషన్‌రెడ్డి,మోడీనేనని ఆయన ధ్వజమెత్తారు. వీరి ముగ్గురిని అరెస్టు చేయనంత కాలం .. కిషన్‌రెడ్డిని కల్వకుంట్ల కిషన్‌రావు అనే పిలుస్తానని మరోసారి ఈ వేదికగా ప్రకటించారు రేవంత్‌రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరెస్ నేతలు ఎవరినీ వదల్లేదని, అందరి మాటలు విన్నారని, అందరినీ బెదిరించారన్నారు. బీఆరెస్ అంటేనే బ్లాక్‌మెయిల్ రాజకీయ పార్టీ అని అభిర్ణించారు.
కొండా విశ్వేశ్వరరెడ్డే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ గురించి బీఆరెస్‌పై ఆరోపణలు చేశారన్నారు. తాను భూములు కొన్న వారి ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి వందల కోట్లు పార్టీ ఫండ్‌గా ఎలక్ట్రోరల్ బాండ్లు రాయించుకున్నారని ఆరోపించారు. వందల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవడబ్బ సొమ్ము ఇదంతా? అని ప్రశ్నించారు సీఎం.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
