(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప్ర‌తిప‌క్ష‌లే లేకుండా చేయాల‌నుకున్నోళ్లు ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడుతున్న‌రు. ఎమ్మెల్యేల‌ను అంగ‌ట్లో ప‌శువుల‌ను కొన్న‌ట్టుగా కొని.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులంటూ చెవి కోసిన మేక‌లెక్క ఒర్లుతున్న‌రు. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కే మెట్టు దిగే మెట్టుగా పిటిష‌న్లు వేసి.. ప్ర‌జాస్వామ్యం జిందాబాద్ అంటున్నారు. అప్పుడు అహంకారం మాట్లాడించింది. గ‌ర్వం త‌ల‌కెక్కిన పాల‌న చేపిచ్చింది. మాకు తిరుగేలేదు.. ఇక మేమే ఎన్నాళ్లైనా అనే ప‌ద‌వీవ్యామోహం.. అధికార దాహం.. పిచ్చి పిచ్చి నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. ఇందులో ప్ర‌ధానంగా కేసీఆర్ నోటి వెంట వ‌చ్చిన అహంకారపూరిత వ్యాఖ్య‌ల్లో మ‌రో ఇర‌వై ఏళ్లూ మేమే.. అనే మాట‌లు. ఇవి ఒక్క‌సారి కాదు. ప‌దుల సార్లు. వంద‌ల‌సార్లు.

అవును ఆయ‌న ఏమాత్రం జంక‌లేదు. బెంక‌లేదు. ఈ మాట అన‌డానికి. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాన్ని బొంద‌పెట్టేసి .. పాతాళంలోకి తొక్కేసినంక మాకిక అడ్డేది.. అనే క‌దా ఆయ‌న త‌ల‌పొగ‌రు. అందుకే ఆ మ‌స్థిష్కం నుంచి ఆ మాట‌లొచ్చాయి. అప్పుడే అంద‌రికీ అర్థ‌మైపోయింది. ఇది అధికార దాహంతో కూడా అహం త‌ల‌కెక్కిన పొగ‌రుబోతు మాట‌ల‌ని. అందుకే స‌మ‌యం కోసం చూశారు ప్ర‌జ‌లు. జ‌నం ఎక్క‌డైనా.. చ‌రిత్ర‌లో ఎప్పుడు చూసినా.. అహంకారాన్ని స‌హించారు. త‌మ‌ను చుల‌క‌న చేసి మాట్లాడేత‌త్వాన్ని తొక్క‌పారేస్తారు అదును చూసి. అడుగుప‌ట్టించేస్తారు ఆ గ‌ర్వంతో కూడిన అతిశ‌యాన్ని. అదే జ‌రిగింది కేసీఆర్‌కు. గుణ‌పాఠం చెప్పారు. బుద్దిగా మ‌స‌లుకొని ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించుమ‌న్నారు. కానీ ఇంకా వాళ్లు మార‌లే. వాళ్ల మాట‌లూ మార‌లే. చేత‌లు అస్స‌లు మార‌లే. అహంకారం త‌గ్గ‌లే. త‌ల‌కెక్కిన గ‌ర్వం ఇంకా దిగ‌లే. స‌రే, ఇవ‌న్నీ ఇప్పుడెందుకు అంటారా?

వ‌స్తున్న అక్క‌డికే.. ఈ మ‌ధ్య సీఎం రేవంత్‌రెడ్డి ఎక్క‌డ మీటింగులు పెట్టినా.. మ‌రో ఎనిమిదేండ్లూ మేమే అంటున్నారు. ఈ మాట‌లు విన‌గానే జ‌నాల‌కు ట‌క్కున కేసీఆర్ గుర్తొస్తున్నాడు. మ‌రో ఇర‌వై ఏళ్లూ మేమే అనే మాట‌లు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాల‌న గుర్తొస్తున్న‌ది. కానీ ఇక్క‌డ రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల నాడి తెలుసుకుని మాట్లాడుతున్నారు. ఆయ‌నా గ‌తంలో మ‌రో మూడు ట‌ర్ములు, నాలుగు ట‌ర్ములూ అంటూ ఏవేవో మ‌ట్లాడారు. అధికార పీఠం మీదున్న‌ప్పుడు కొంచెం గ‌ర్వంతో కూడిన మాట‌లు వ‌స్తుంటాయి. లేదా పార్టీ నాయ‌కుల ఆత్మ‌స్థైర్యం పెంచేందుకూ ఒక్కోసారి మ‌ళ్లీ మేమే వ‌స్తాం అని అనొచ్చు. కానీ ఏకంగా నాలుగు ట‌ర్ములు… ఇర‌వై ఏళ్లూ అని మీరే డిసైడ్ అయితే.. మ‌ధ్య‌లో ప్ర‌జ‌లు పిచ్చోళ్లా? అక్క‌డే మండేది వాళ్ల‌కు. జ‌నాల‌ను చుల‌క‌న చేసిన‌ట్టు చూసినా.. పిచ్చోళ్లుగా భావించిన‌ట్టు మాట్లాడినా.. ట‌క్కున ప‌ట్టేస్తారు వాళ్లు. నోరు అదుపులో పెట్టుకోక‌పోతే ప‌ర్య‌వ‌సానం ఘోరంగా ఉంటుంది.

ఫామ్‌హౌజ్ న‌ర‌కం జైలు శిక్ష లాంటిది వేసేస్తారు. అందుకే రేవంత్ త్వ‌ర‌గానే ఈ మాట‌లను స‌రిద్దిదుకున్నారు. ఇప్పుడు ఆయ‌న మ‌రో ఎనిమిదేండ్లూ మేమే అంటున్నారు. అంటే.. ఇప్పుడు మ‌రో మూడేండ్లు.. వ‌చ్చే ట‌ర్ము మ‌రో ఐదేండ్లు.. మొత్తం ఎనిమిదేండ్లు .. అన్న‌మాట‌. బాగుంది. మ‌రోసారి కూడా ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్నే ఆశీర్వ‌దిస్తారు. ఆశీర్వ‌దించేలా పాల‌న చేస్తాం.. అని జ‌నానికి చెప్పిన‌ట్టు ఉంటుంది.. క్యాడ‌ర్‌లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచిన‌ట్టూ ఉంటుంది. దీన్ని జ‌నం అహంకార‌పు, అధికార పైత్య‌పు మాట‌లు అనుకోరు. జ‌నం మ‌న‌సును గెలుచుకుంటాం.. మ‌ళ్లీ వ‌స్తామ‌నే ధీమాను ప్ర‌ద‌ర్శించిన‌ట్టుగా చూస్తారు. స‌మ‌యం ఉండ‌నే ఉంది. ఈ మిగిలిన ట‌ర్ము రెండున్న‌రేండ్ల‌లో పాల‌న ఇంకా ఎలా ఉంటుందో చూస్తారుగా. అప్పుడు జ‌నం అనుకుంటారు.. ప‌ర్లేదు మ‌రోసారి ఇద్దామ‌ని. ఇప్పుడు మ‌ళ్లీ అధికారం ఇచ్చిన త‌రువాత ఇంకో ట‌ర్మూ మేమే వ‌స్తామ‌ని చెప్పొచ్చు. ఇప్పుడే అవ‌న్ని లెక్క‌లు చెప్పి.. జ‌నం చేతిలో బొక్క‌లు విర‌గ్గొట్టుకోవాలా? అందుకే రేవంత్ అహంభావం మాట‌ల ప‌ర్య‌వ‌సానం క‌ళ్ల‌ముందు క‌నిపిస్తూనే ఉంద‌నే వాస్త‌వాన్ని గ్రహించి.. ధీమాతో మ‌రో ట‌ర్ము జ‌నం అధికారం ఇస్తార‌ని అనుకోవ‌డం.. ఇవ్వాల‌ని కోరుకోవ‌డం.. ఈ రెండూ క‌ల‌గ‌లిపి మాట్లాడ‌టం ద్వారా జ‌నం ఓకే అనే వాత‌వార‌ణ‌మే ఉంటుంద‌ని అనుకోవాలి.

Dandugula Srinivas

Senior Journalist

7661066999