(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప‌థ‌కాల‌న్నీ ఓ వైపు.. ప్ర‌ధానంగా ఈ మూడు ప‌థ‌కాలు మ‌రోవైపు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ఇవి ప్ర‌భావితం చేస్తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. స్వ‌యంగా సీఎం రేవంత్‌రెడ్డే బ‌హిరంగ స‌భ‌ల్లో వీటి ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే తీసుకువ‌స్తున్నారు. ఆయ‌న ప్ర‌సంగంలో ఇవి ఎక్కువ‌గా చక్క‌ర్లు కొడుతున్నాయి. అవి రేష‌న్‌కార్డులు, స‌న్న‌బియ్యం… చివర‌గా ఫ్రీబ‌స్సు. అవును. ఎవ‌రు కాద‌న్నా.. అవున‌న్నా పేద‌జ‌నం వీటికి బాగా క‌నెక్ట‌య్యారు. స‌ర్కార్‌ను ఈ విష‌యంలో మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వారు గ‌త పేద‌ళ్లుగా సాగిన పాల‌నలో బాధితులు కాబ‌ట్టి. రేష‌న్‌కార్డులు ఇవ్వ‌కుండా ఏళ్ల త‌ర‌బ‌డి ఆ పోర్ట‌ల్‌కు తాళం వేసేసింది అప్ప‌టి స‌ర్కార్‌. ఇక స‌న్న‌బియ్యం అనే స్కీంను చాలా లైట్‌గా తీసుకున్నాడు కేసీఆర్‌.

పేదలు, నిరుపేద‌ల్లో కూడా చాలా మంది దొడ్డు బియ్యం తినే అల‌వాటును మానుకున్నారు. కార‌ణం.. వారి సంతానం. అవును.. నేటి త‌రం పిల్ల‌లు దొడ్డుబియ్యం బువ్వ తిన‌డం లేదు. వారి గొంతులోకి ఆ ముద్ద దిగడం లేదు. అందుకే ఆ పిల్ల‌ల కోస‌మైనా కిలో న‌ల‌బై, యాబై పెట్టి మ‌రీ స‌న్న‌బియ్యం కొనుక్కురావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇది పేద‌ల బ‌డ్జెట్‌లో పెద్ద భారంగానే మారింది ప్ర‌తి నెలా. రేవంత్ స‌ర్కార్ ఈ బాధ‌ను అర్థం చేసుకున్న‌ది. ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించి జ‌నం నాడి దొర‌క‌బ‌ట్టుకున్న‌ది. అందుకే స‌న్న‌బియ్యం ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది. దీంతో దొడ్డు బియ్యం బ‌య‌ట అమ్ముకునే ప‌రిస్థితి త‌ప్పింది. బ‌య‌ట వంద‌లాది రూపాయ‌లు వెచ్చింది స‌న్న‌బియ్యం కొనే దుస్థితీ త‌ప్పింది. వీటితో పాటు ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం కూడా పేద‌ల బ‌డ్జెట్‌లో చాలా భారాన్నే త‌గ్గించింది. ఇప్పుడు బ‌స్సు చార్జీలంటే క‌నీసం ఆలోచించి, భ‌య‌ప‌డే ప‌రిస్థితి లేదు పేద‌ల కుటుంబాల్లో.

కానీ ఈ అంశాల‌ను పోటీ చేసేఅభ్య‌ర్థులు ఎక్క‌డా పెద్ద‌గా ప్ర‌చారం చేసుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం. హ‌డావుడి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కావొచ్చు. పోటీ వాతావ‌ర‌ణంలో టైమ్ స‌రిపోక‌కావొచ్చు. అభ్య‌ర్థుల ఎంపిక‌లో అవ‌గాహ‌న లేని క్యాండేండ్లు కావొచ్చు.. ఇలా ఏది ఏమైనా ఈ మూడు ప‌థ‌కాలు పేద‌ల జీవితాల్లో ప్ర‌భావితం కాబ‌డ్డాయి. రేపు గెలుపోట‌ముల్లో కూడా ఇవి ప్ర‌భావం చూప‌గ‌లుగుతాయి.

Dandugula Srinivas

Senior Journalist

7661066999