(దండుగుల శ్రీనివాస్)
బరిబాతల ఊరిగే ఉన్న ఇజ్జత్ తీసుకున్నది మీడియా. ఏది చేసినా చెల్లుతుందనే ముసుగులో.. అక్రమసంబంధాలను అంటగట్టి మరీ దిగజారి పాతాళానికి పడిపోయింది. అందుకే ఇలా నడిరోడ్డులో బరిబాతల నిలబడి పరువు తీసుకున్నది. ఇప్పుడు ఈ మీడియాకు సపోర్టు దక్కలేదు. సానుభూతీ కరువైంది. ఏదో సినిమాలో అరెస్టులను ఖండిస్తన్నామంటే…ఖండిస్తున్నామని సంఘాలు చెప్పుకున్నాయే తప్ప.. ఆ మీడియా చేసిన పనికి అంతా సిగ్గుపడాల్సిందే.
వృత్తి ధర్మం అని మాట్లాడుతున్నారు. కానీ వెనుకాముందు చూసుకోవద్దా? ఎవరో లీక్ చేస్తేనే గదా .. వార్తగా వచ్చిందీ అంటున్నారు… మరి ఆ లీకు వెనుక నిజమెంత..? మనం ప్రపంచానికి చెప్పే వార్త ద్వారా ఎవరిని అవమానించబోతున్నాం… ఎవరిని దోషిగా నిలబెట్టబోతున్నాం.. ఎవరి పరువును గంగలో కలపబోతున్నాం.. అని సోయి ఉండఖ్కర్లేదా? మీడియా స్వేచ్చ అని దానికి పేరు. ఓ మహిళా కలెక్టర్నే మనం పట్టించుకోలేదంటే.. ఇంకెవర్ని వదలుతాం? ఇది మరీ విపరీత పోకడ కాదా? విచ్చలవిడితనం కాదా? అందుకే ఈ మీడియాకు సానుభూతి దొరకలేదు. అరెస్టులపట్ల సపోర్టు కరువైంది. మంచిగైంది..? ఇట్లనే కావాలనుకుంటున్నారంతా. ఇక దీన్ని బట్టుకుని కేటీఆర్ అండ్ టీమ్ పెయిడ్ బ్యాచ్ జర్నలిస్టులు విచ్చలవిడిగా కథలల్లేశారు. స్వామి మెప్పు పొందేందుకు ఎవరికి తోచిన విధంగా వారు ఎక్కువగానే బురద జల్లే ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకునేందుకు పోటీలు పడ్డారు.
ఇదే మంచి తరుణంగా సర్కార్ భావించింది. తీటగాళ్ల తోలు తీసేందుకు సిట్ వేసింది. విచ్చలవిడితనంతో పేట్రేగిపోతున్న మీడియా ముసుగులో ఉన్న తీటగాళ్ల పనిపట్టేందుకు పోటుగాడు సజ్జనార్‌ను బరిలోకి దింపింది. సజ్జనార్.. మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు తడబాటు లేకుండా సూటిగా, ఘాటుగానే ఆన్సర్ ఇచ్చాడు. ఎమెర్జెన్నీ కాదిది. అలా అయితే మీరంతా లోపలుంటారన్నాడు. నోటీసులెందుకు? సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ కోసం.. ఎక్కడికైనా వెళ్తాం…ఎలాగైనా పట్టుకొస్తాం.. మీకు భయమెందుకు? బ్యాంకాక్‌కు ఎందుకు పారిపోతున్నారు? అని నిలదీశాడు. కడిగేశాడు. దీనిపై కేటీఆర్, హరీశ్ విరుచుకుపడుతున్నారు. ముసలికన్నీరు కారుస్తున్నారు. మహిళా ఐఏఎస్‌పై కథనాలు కరెక్టేనా మరి? సర్కార్‌ను బద్నాం చేస్తే చాలు .. ఏం రాసినా ఓకే.. ఎంత దిగజారినా సరే.. అన్నట్టుగానే ఉన్నాయి వారిద్దరి మాటలు. ఎవడుబడితే వాడు యూట్యూబ్ చానెల్ పెట్టుకోవడం.. దానికి మీడియా అనే ముసుగేయడం.. జర్నలిస్టుగా నామకరణం తనుకు తాను చేసేసుకోవడం.. నోటికేదొస్తే అది వాగేయడం.. తీట మాటలతో చెలరేగిపోవడం.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్. మరి ఇలాంటి వాటిని పెంచి పోషిస్తున్న నాయకులు.. నీతులు మాట్లాడితే నవ్వుపోరా?
ఇప్పుడు ఈ సిట్‌కు చేతినిండా పని. మార్పింగులు చేస్తూ మమ్మల్నెవడూ పీకలేరనుకునే వాళ్లకు, తప్పుడు వార్తలు, ఫేక్ క్లింప్పింగులు సృష్టిస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ పైశాచికానందం పొందే వాళ్లకు ఇది సింహాస్వప్పం కానుంది. ఏది రాసినా చెల్లుతుందని….నోటిదూల తీర్చుకునే మీడియా నోటికీ తాళం పడుతుంది. లేదంటే మన పరువు మనమే తీసుకుని.. ఇప్పుడున్నది చాలదంటూ కొత్త కంపును, అప్రతిష్టను తెచ్చిపెట్టుకుని రాష్ట్రం పరువును బరిబాతల నిలుపుకుంటే.. అది ఎవరికీ మంచిది కాదు. ఇప్పుడున్న ప్రతిపక్షం దీన్ని ఎంజాయ్ చేస్తుండొచ్చు.. కానీ తమదాకా వస్తే.. అప్పుడు తెలుస్తుంది దీని తీవ్రత. అందుకే ఇలాంటి వార్త కథనాలు, ఫేకుడు, జోకుడు కోసం ఏదైనా రాసేస్తాం.. మమ్మల్నెవడురా ఆపేది అనే తలపొగరు దించేందుకు తీటగాళ్లకు పోటుగాడిలానే అనిపిస్తుంది సజ్జనార్‌ను చూస్తే.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
