(దండుగుల శ్రీనివాస్)
సీఎం ఏం మాట్లాడినా దాన్ని నెగిటివ్ కంటెంట్‌లో ప్రజెంట్ చేసి రాజకీయ లబ్ది కోసం బీఆరెస్ తెగ పాకులాడుతోంది. తాజాగా ఆ పార్టీకి దొరికిన అంశం జిల్లాల విభజన. రేవంత్‌రెడ్డి అన్నది… జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు… కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని. వారి విజ్ఞప్తి మేరకే కొన్ని మండలాలు, మరికొన్ని రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేసి ప్రజావసరాలకు అనుగుణంగా మార్చాలని. దీనికి కమిషన్ వేసి ఆ మేరకే నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పాడు. అంతేకాదు.. జిల్లాలు తగ్గించేది లేదు.. పెంచేది లేదు అని కూడా క్లారిటీ ఇచ్చేశాడు. కానీ కేటీఆర్ మాత్రం.. ఇదిగో పాము అంటే అదిగో పడగ.. అన్నట్టుగా జిల్లాలు రద్దు చేస్తే అగ్గి రాజేస్తం.. కుంపటి రలిగిస్తాం.. అగ్గిరవ్వలయితమని ఏవేవో కామెంట్లు కూడా చేసేశాడు. ప్రజల్లో దీని పట్ల ఓ నెగిటివ్ భావన తీసుకుపోవాలనేది ఆ పార్టీ దురుద్దేశం. అది అర్థమవుతూనే ఉంది. మరి… వాస్తవమేమిటీ..?
అసలు జిల్లాలు తగ్గించే పనిని ఏ ప్రభుత్వమైనా తలకెత్తుకుంటుందా? మూర్ఖత్వం కాకపోతే. ఎప్పుడో యాభై అరవై ఏండ్లకు గానీ జిల్లాల విభజన.. జిల్లాలు పెంచే పని జరగదు. అది బీఆరెస్ టైమ్‌లో జరిగింది. దాన్ని శాస్త్రీయంగా, సమగ్రంగా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని తగ్గించే అవసరం లేదు. ఏ సర్కార్ చేసినా భవిష్యత్ అవసరాలు. జనభా పెరుగుదల, ప్రజా సౌలభ్యం… అన్నీ చూసుకునే కదా చేస్తుంది. అది రేవంత్ సర్కార్‌కు తెలవదు. తెలుసు. కానీ ఆయనన్నది… కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు.. మార్పు చేయాలని. ఉన్న జిల్లాలు తగ్గించాలని కాదు. అయితే గియితే మరో జిల్లాను పెంచినా పెంచుకుంటాడు సీఎం. తన సొంత జిల్లా పాలమూరులో. కానీ తగ్గించే ప్రసక్తే ఉండదు. ఇలా చేస్తే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడం ఖాయం. అది కచ్చితంగా రేవంత్‌కు తెలుసు. అలాంటి బుద్దిమాలిన పని ఆయన చేయనుగాక చేయడు.
నిజంగా ఇప్పుడున్న జిల్లాల్లో చాలా చోట్ల కొన్ని ఇబ్బందులున్నాయి జనాలకు. వాటి నైసర్గిక స్వరూపాలు మారిస్తే సరిపోతుంది. అంతే. జిల్లాలను టచ్ చేసి దాన్ని గెలుక్కుని. వాటిని రద్దు చేసి పెంట పెంట చేసుకుని… ఇప్పుడున్న సమస్యలు చాలవని.. ఇంకా కొత్తవి తెచ్చిపెట్టుకునే ఉద్దేశంలో సీఎం లేడు. అది కచ్చితమైన క్లారిటీ. కానీ కేటీఆర్‌కు మాత్రం బాగా ఉబలాటం.. దీన్ని కూడా ఏమైనా జనాలను రెచ్చగొట్టి తమకు అనుకూలంగా చేసుకుందామని. మున్సిపాలిటీల కోసం చెత్త బుద్దులు, మున్సిపాలిటీ ఆలోచనలన్నమాట.
నిజంగా ఉద్యోగుల విషయంలో, వారి సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో కొన్ని మార్పులు జరగాల్సిందే. తెలంగాణలో మొత్తం 8 జోన్లున్నాయి. రెండు మల్టీజోన్లున్నాయి. ఉమ్మడి జిల్లాలను విడదీసినప్పుడు ఆ విడిపోయిన జిల్లాలను ఒకే జోన్లో పెట్టలేదు. వేర్వేరు జోన్లకు మార్చారు. దీని వల్ల ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో ఆటంకాలేర్పడ్డాయి. ఇది ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. ఇక రెండు మల్టీజోన్లలో ఒకటో మల్టీజోన్ మొత్తం గ్రామీణ జిల్లాలే పెట్టేసి.. రెండో మల్టీజోన్‌లో మేడ్చల్, రంగారెడ్డిలను ఇరికించారు. దీనివల్ల ఉద్యోగులు కొందరు గ్రామీణ జిల్లాలనే ఉద్యోగాలు చేయాల్సిరాగా.. సిటీలో వారికి చాన్స్ లేకుండా పోయింది. దీనికి బదులుగా.. ఒక మల్టీజోన్‌లో మేడ్చల్ జిల్లాను పెట్టి.. మరో మల్టీజోన్‌లో రంగారెడ్డిని చేరిస్తే.. ఈ రెండు మల్టీజోన్ల పరిధిలో ఎక్కడ పనిచేసినా.. సిటీలో ఉద్యోగం చేశామని తృప్తి, సౌకర్యం ఉద్యోగుల్లో ఉంటుంది. ఈ అసంతృప్తైతే ఉద్యోగుల్లో ఉంది. దీన్ని కూడా సర్కార్ పరిగణలోకి తీసుకోవాలి.
