(దండుగుల శ్రీనివాస్)
బీఆరెస్‌లో కవిత వేరు కుంపటి తరవాత ఇప్పుడు రాజకీయాల్లో తెరపైకి వచ్చిన అంశం వారసత్వ పోరు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం.. ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్ వరకు కూడా ఈ వారసత్వ పోరు తప్పలేదని. ఇప్పుడు మనం డీఎస్ గురించి చెప్పుకుందాం. కాంగ్రెస్ సీనియర్ లీడర్, పీసీసీ చీఫ్‌గా రెండు సార్లు పనిచేసి.. అధిష్టానం పెద్దలతో మంచి సంబంధాలు నెరిపిన ధర్మపురి శ్రీనివాస్ కూడా తన జీవిత చరమాంకంలో ఈ వారసత్వ పోరును ఎదుర్కొన్నారు. ఆయన చివర రాజకీయ మజిలీ కూడా ఈ పోరు వల్లే చిన్నాభిన్నమైంది. పెద్ద కొడుకు సంజయ్‌ను నిజామాబాద్ నగర తొలి మేయర్‌గా చేసి రాజకీయ ఆరంగేట్రం చేసి వారసత్వ రాజకీయాన్ని స్టార్ట్ చేయించాడు డీఎస్.
కానీ అప్పటికి చిన్న కొడుకు అర్వింద్ రాజకీయాల్లో లేడు. అసలు అతని ప్రస్తావనే తెలియదు ఎవరికీ. ఆ తరువాత బీఆరెస్ అధికారంలోకి రావడం.. డీఎస్ కాంగ్రెస్‌లో ఇమడలేకపోవడం.. బీఆరెస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు. కొడుకు సంజయ్‌కు కూడా బీఆరెస్‌లో పదవి రాబట్టాలని చూశాడు. కానీ అక్కడ డీఎస్ చెప్పింది నడవలేదు. చెబితే వినిపించుకునేవారే లేరు. పార్టీలో చేరిన తరువాత ఒకలా.. చేరిన తరువాత మరోలా ప్రవర్తించడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. దీనికి తోడు చిన్న కొడుకు అర్వింద్ తన రాజకీయ ఆరంగేట్రాన్ని బీజేపీతో స్టార్ట్ చేశాడు. ఇది డీఎస్‌కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. అప్పటికే ఇక్కడ ఎంపీగా కవిత ఉన్నది.
కవిత పై బీజేపీ నుంచి ఎంపీగా పోటీయాలని అర్వింద్ రంగం సిద్దం చేసుకున్నాడు. ఇది కేసీఆర్‌కు తెలిసింది. డీఎస్‌ను అవమానించాడు. నీకు తెల్వకుండా నీ కొడుకు పోటీకి సిద్దమయ్యాడా? కొడుకును కూడా కంట్రోల్ చేసుకోలేని తండ్రివా? అంటూ అందరి ముందే తూలనాడాడు. పెద్ద కొడుకు సంజయ్‌ను లైంగిక ఆరోపణల కేసులో జైలుకు పంపడం కూడా డీఎస్ జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు ఇద్దరి కొడుకుల మధ్య వార్. ఇద్దరికీ పడిరాదు. తండ్రికి వారసుడు నేనంటే నేను అని డీఎస్ చివరాంకంలో పీకులాట. ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషేనని పెద్ద కొడుకు.. కాదు కాదు బీజేపీ అని చిన్న కొడుకు… ఇలా మనశ్శాంతి లేకుండా చేశారు. ఇప్పుడు అచ్చంగా కేసీఆర్‌కు అదే రిపీట్ అవుతోంది. బిడ్డె పెద్ద గుదిబండై కూర్చింది. తెలంగాణ జాతి పితగా కీర్తించాలని కలలు కన్న కేసీఆర్‌కు ఇంటిపోరు.. వారసత్త పోరు జీవిత చరమాంకంలో తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది.

dandugula srinivas
senior journalist
7661066999
