(మ్యాడం మ‌ధుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు)

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వానికి స‌వాలుగా మారింది. పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి కి ప్ర‌త్య‌క్షంగా సెగ త‌గిలింది. పార్టీకి పెద్ద దిక్కైన కిష‌న్‌రెడ్డి నాయ‌క‌త్వ వైఫ‌ల్యంపై కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అన్నా నీకో దండం..! త‌ప్పుకో..!! మంచి నాయ‌క‌త్వానికి అవ‌కాశం ఇవ్వండి.. అంటూ కిష‌న్‌రెడ్డిపై కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో ప్రాధేయ ప‌డుతున్నారు.. మీరుండ‌గా మంచి మంచి నాయ‌క‌త్వం రాద‌ని, ఢిల్లీలో జాతీయ రాజ‌కీయాలు చూసుకుంటే మేల‌ని స‌ల‌హాలు ఇస్తున్నారు. వేల సంఖ్య‌లో కిష‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతున్నారు. జ‌నానికి క‌మ‌లానికి ఓటేయాల‌ని ఉంది… కానీ ఆ గుర్తునే క‌న‌బ‌డ‌కుండా చేస్తున్నార‌ని అగ్ర‌నాయ‌క‌త్వం ఒంటికాలు మీద లేస్తున్నారు. ఉన్న నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌డ‌నివ్వ‌రు… కొత్త నాయ‌కుల‌ను రానివ్వ‌రు… వ‌చ్చినా ఉండ‌నివ్వ‌రు. అస‌లేం జ‌రుగుతోంది ఈ పార్టీలో.. అంటూ తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బీజేపీ గెలుపుపై ఎవ‌రికీ ఆశ‌లు లేక‌పోయినా.. క‌నీసం ఉనికిని చాటుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యామ‌నే ఆగ్ర‌హం కార్య‌క‌ర్త‌ల్లో రగులుతున్న‌ది. గెలుపు కోసం ఆరాటం లేకున్నా.. ఉనికిని చాటుకోవాల‌న్న పోరాటం.. మా అగ్ర‌నాయ‌కుడు కిష‌న్‌రెడ్డిలో క‌నిపించ‌లేద‌ని తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు మోడీ పేరు మీద రాజ‌కీయం చేస్తారు..? ఎన్ని రోజులు ఆయ‌న బొమ్మ పెట్టుకుని సిగ్గులేకుండా బ‌తుకుతారంటూ అగ్ర నాయ‌కత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.

కేవ‌లం వ్య‌క్తిగ‌త స్వార్థాల కోసం పార్టీని క‌న‌బ‌డ‌నీయ‌కుండా చేస్తున్నార‌ని కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో హీరోగా, స్థానిక ఎన్నిక‌ల్లో జీరోగా నిలుస్తున్న బీజేపీలో.. కార్య‌క‌ర్త‌లు తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. స్థానిక రాజ‌కీయాల్లో క‌నీసం ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా కూడా ఎద‌గ‌కుండా అగ్ర నాయ‌కులే తొక్కి వేస్తున్నార‌ని కార్య‌క‌ర్త‌ల‌కు విలువ లేకుండా పోయింద‌ని, కొత్త నాయ‌కుల‌ను, యువ నాయ‌కుల‌ను అణ‌గ‌దొక్కుతున్నార‌ని విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నిక త‌రువాత మొత్తం అంద‌రి దృష్టి కేంద్ర మంత్రిపై ప‌డింది. కేంద్ర మంత్రిగా, సికింద్ర‌బాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయార‌న్న‌ది కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హం. గ‌తంలో కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్రాతినిద్యం వ‌హించారు. వ‌రుస‌గా త‌రువాత రెండు సార్లు కిష‌న్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, క‌నీసం పోలింగు ఏజెంట్లుగా స్థానిక కార్య‌క‌ర్త‌లు క‌నిపించ‌లేదు. అంతా బ‌య‌టివారే. పోలింగు ఏజెంట్లుగా కూర్చోవ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రాని దీన ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కొత్త నాయ‌క‌త్వాన్ని ఎద‌గ‌నీయ‌క‌పోవ‌డం, క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, వ్య‌క్తిగ‌త స్వార్థం కోస‌మే ప‌నిచేయ‌డం వ‌ల్ల పార్టీకి ఇటువంటి దుస్థితి ఏర్ప‌డుతుంద‌ని కిష‌న్‌రెడ్డి తో పాటు అగ్ర‌నాయ‌కత్వంపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేస్తున్నారు.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 30 శాతం వ‌చ్చే ఓట్లు .. స్థానిక ఎన్నిక‌ల్లో ప‌ది శాతం కూడా ఎందుకు రావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంటే.. ఇత‌ర పార్టీల నాయ‌క‌త్వాన్ని ప‌టిష్ట ప‌రిచే విధంగానే బీజేపీ రాష్ట్ర అగ్ర నాయ‌క‌త్వ వైఖ‌రి ఉంద‌నేది కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హం. ఈ సారి జూబ్లీహిల్స్ ఎన్నిక‌లు కాబ‌ట్టే..అంద‌రి దృష్టి కిష‌న్ రెడ్డిపై కేంద్రీకృత‌మై ఉంది. రాజ్య‌స‌భ స‌భ్యుడు,కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ పార్ల‌మెంటు స‌భ్యుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఈ ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకోలేదు కాబ‌ట్టి కొంత మిన‌హాయింపు దొరికింది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జ‌నాలు. బండి సంజయ్ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్తేజం తెస్తున్న‌ప్ప‌టికీ, ఆయ‌న మాట‌లు, చేష్ట‌లు ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బ‌ల‌ప‌రిచే విధంగా ఉంటున్నాయ‌ని విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. విష‌య ప‌రిజ్ఞానం ఉన్న ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్ లాంటి వ్య‌క్తుల‌ను మ‌రీ దూరంగా నెడుతున్నార‌నే విమ‌ర్శ ఉంది. ఇక జూబ్లీహిల్స్ విష‌యానికొస్తే.. అభ్య‌ర్థి ఎంపిక నుంచి మొద‌లుకొని, ఎన్నిక చివ‌రి వ‌ర‌కు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి త‌న ఈ ఘోర వైఫ‌ల్యానికి బాధ్య‌త వ‌హించాల‌ని, పార్టీ నాయ‌క‌త్వం నుంచి మొత్తంగా త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ రాజ‌కీయాల‌కే కిష‌న్‌రెడ్డి ప‌రిమితం కావాల‌ని, స్థానికంగా బ‌ల‌ప‌ర్చాల‌ని, యువ నాయ‌కుల‌ను ఎద‌గ‌నీయాల‌ని, సిండికేట్ రాజ‌కీయానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని దండం పెడుతున్నారు. అన్నా.. త‌ప్పుకో..! అని వేడుకుంటున్నారు. పార్టీలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మొద‌ట నుంచి కార్య‌క‌ర్త‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ది. కొంద‌రు నాయ‌కులు గ్రూపుగా ఏర్ప‌డి త‌మ స్వార్థం కోసం పార్టీని ఎద‌గ‌నీయ‌డం లేద‌ని, జ‌నం ఓటు వేయాల‌నుకున్నా.. వారిని పార్టీ పైకి రాకుండా అడ్డుకుంటున్నార‌ని, వంచ‌న చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు సామ‌న్య కార్య‌క‌ర్త‌లు పోస్టులు పెడుతున్నారు. ఒక్క కిష‌న్‌రెడ్డే కాదు.. సోష‌ల్ పోస్టుల ఉద్య‌మం రాష్ట్ర పార్టీ కార్యాల‌యానికి, కేంద్ర పార్టీ నాయ‌క‌త్వానికి సోష‌ల్ పోస్టుల సెగ ప్ర‌త్య‌క్ష రూపంలో రాష్ట్ర‌, కేంద్ర కార్యాల‌యానికి, కేంద్ర నాయ‌క‌త్వానికి త‌గిలే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ఇక‌నైనా మారండి..! నాయ‌క‌త్వాన్ని మార్చండి..! పార్టీని బ‌తికించండి..!! కార్య‌క‌ర్త‌లు, ద్వితీయ శ్రేణీ నాయ‌కులు ఉద్య‌మించే ప‌రిస్థితి బీజేపీలో క‌నిపిస్తున్న‌ది. కిషన్‌రెడ్డి లాంటి అగ్ర‌నాయ‌కుల‌ను త‌ప్పించి ,వారిని స‌ల‌హాదారులుగా ప‌రిమితం చేయాల‌ని , పార్టీకి మంచి నాయ‌క‌త్వాన్ని తీసుకురావాల‌ని కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ పోస్టుల‌లో దుమ్ము రేపుతున్నారు.