(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆమె అంత‌రంగా ఎవ‌రికీ చిక్క‌డం లేదు. పార్టీ నుంచి వెళ్ల‌గొట్టారు. త‌నూ వెళ్లిపోవాల‌నుకుంది. అన్న‌తో పొస‌గలేదు. తండ్రి అన్నీ అన్నే అన్నాడు. బిడ్డెకు ఎందుకు రాజీక‌యం.. రాజ‌కీయ వార‌స‌త్వం అని తేల్చేశాడు. తండ్రి మీద కోపం.. అన్న మీద ఆక్రోషంతో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పార్టీ పెట్టేముందు అంతా క‌లియ తిరుగుతున్న‌ది. అంతా బాగానే ఉంది. త‌ను ఫైర్ బ్రాండ్‌న‌ని ముద్ర వేసుకునే క్ర‌మంలో మెల్ల‌గా బీఆరెస్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ ఉన్న‌ది. మొద‌టి హ‌రీశ్‌రావును టార్గెట్ చేసింది. ఆ త‌రువాత కేటీఆర్ పేరు తీసుకున్న‌ది. అన్న‌నీ వ‌ద‌ల‌డం లేదు. ఇక ఇద్ద‌రినీ నెంబర్ మీద తీసుకున్న త‌రువాత వేరే వారిని వ‌దులుతుందా? వ‌రసుపెట్టి అంద‌రినీ అర్సుకుంటున్న‌ది. ప‌ల్ల రాజేశ్వ‌రెడ్డి, వేముల ప్ర‌శాంత్‌రెడ్డి, జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి.. అంద‌రినీ అంద‌రినీ తిట్టిపోస్తున్న‌ది. వీళ్ల ఆస్తులు ఇంత‌లా ఎలా పెరిగాయి? అని నిల‌దీస్తున్న‌ది.

అంద‌రినీ తిడుతున్న ఆమె.. కేసీఆర్‌ను మాత్రం ప‌ల్లెత్తు మాట‌న‌డం లేదు. ఆయ‌న దేవుడేనంటున్న‌ది. వీళ్లే ద‌య్యాలంటూ దుమ్మెత్తిపోస్తున్న‌ది. బీఆరెస్ పార్టీని చీల్చి చెండాడుతున్న‌ది. ఆ పార్టీని పాతాళం ప‌ట్టేదాకా వ‌ద‌ల‌డం లేదు. క‌విత అనుస‌రిస్తున్న ఈ స్థితిని ఆమె అభిమానులు, జాగృతి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులే అర్థం చేసుకోలేక‌పోతున్నారు. కేసీఆర్ ఓకే అంటున్న‌ది. మిగిలిన వాళ్లంతా వేస్టుగాళ్లంటున్న‌ది. మ‌రి కేసీఆర్‌కు తెలియ‌కుండా ఇంత జ‌రుగుతుందా? ఆయ‌న నోటీసులో లేకుండా, ఆయ‌న‌ను మోసం చేసి ఎవ‌రెవ‌రో పార్టీని నాశ‌నం చేస్తున్నారా? కేసీఆర్‌కు ఇవేమీ తెలియ‌డం లేదా? కేటీఆర్ తండ్రిని అంత‌లా త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నాడా? హ‌రీశ్‌రావు తెర వెనుక అన్ని గోతులు తోడుతున్నాడా? ఫామ్ హౌజ్‌లో ఉండే నాయ‌కులంతా మేక‌వ‌న్నె పులులా..? గోతి కాడి న‌క్క‌లా?

పాపం.. క‌విత .. రాజ‌కీయంగా త‌నో స్టాండ్ తీసుకునే క్ర‌మంలో తండ్రిని విమ‌ర్శించ‌లేక.. ఆమె తీసుకున్న ద్వంద్వ వైఖ‌రి ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌లుచ‌న చేసేలాగే ఉంది. జ‌నం చెవిలో పువ్వులో పెట్టే విధంగా రాజ‌కీయం చేస్తే ఆమెను న‌మ్మేదెవ‌రు? ఏదైనా స్టాండ్ తీసుకుంటే గ‌ట్టిగానే, స్ప‌ష్టంగానే ఉండాలి. ఇలా డొంక తిరుగుడెందుకు? ప‌నిలో ప‌ని తండ్రిని కూడా మ‌డ‌త పెట్టేస్తే కాదా? ఆయ‌న మంచోడే కానీ.. అంటూ న‌సుగుడెందుకు? పార్టీ భ్ర‌ష్టుప‌ట్ట‌డానికి, ఓట‌మికి కేసీఆర్ కార‌కుడు కాదా? ఆయ‌న తీసుకున్న నియంత నిర్ణ‌యాలు, సొంత పోక‌డ‌లు, మూర్ఖ‌పు ఆలోచ‌న‌లు కార‌ణం కాదా? త‌ను ఏది చెబితే అదే క‌రెక్టు అనే మోనోప‌లి మ‌న‌స్థ‌త్వం కార‌ణం కాదా? సిట్టింగుల‌కే మ‌ళ్లీ మ‌ళ్లీ టికెట్లిచ్చి వారిని పెంచి పోషించి.. జ‌నం చీద‌రించుకునేలా చేసింది కేసీఆర్ కాదా?

ఇవ‌న్నీ క‌విత‌కు తెలుసు. కానీ.. కానీ.. తండ్రిని ఏమీ అన‌లేదు. అంటే ఇంతపాటి రాజ‌కీయ ఉనికి కూడా కోల్పోతానేమోన‌ని భ‌యం కావొచ్చు. కేసీఆర్‌ను అభిమానించి.. కేటీఆర్‌ను ద్వేషించే గ్యాంగ్‌ను మొత్తం త‌న పార్టీలోకి లాగాల‌నే ఎత్తుగ‌డ కావొచ్చు. కానీ ఒక్క‌టి మాత్రం వాస్త‌వం… ఆమె బీఆరెస్‌ను ఎంత‌లా తిట్టినా… కేటీఆర్‌, హ‌రీశ్‌పై ఎంత‌లా దుమ్మెత్తిపోసినా.. ఆ తిట్టు కేసీఆర్‌కే త‌గులుతాయి. ఆ దుమ్ము కేసీఆర్ నెత్తిమీదే ప‌డుతుంది. ఇది క‌విత‌కు కూడా తెలుసు. జ‌న‌మే పిచ్చోళ్ల‌లా ఆమె స్టాండ్ ఏమిట‌బ్బా అని నెత్తి గోక్కుంటున్నారంతే!

 

Dandugula Srinivas

Senior Journalist

7661066999