(దండుగుల శ్రీనివాస్)
ఒక్క జూబ్లీహిల్స్ రాజకీయంగా ఎన్నో మలుపులు తిప్పుతుందనుకున్నారు. అంతా అనుకున్నట్టే మలుపులు తిప్పింది. మెరుపులూ మెరిపించింది. కళ్లు బైర్లు కమ్మేలా కూడా చేసింది. అనుమానం, అపోహ పొరలు తొలగించేసింది. ఈ ఎన్నిక సర్కార్‌కు రెఫరెండమన్నారు. మేమే గెలుస్తున్నాం చూడు అని బలుపు మాటలు మాట్లాడి.. అహంకారం ఇంకా పోలేదని నిరూపించుకున్నాడు కేటీఆర్. ఫామ్ హౌజ్ వీడని నియంత పోకడల కేసీఆర్.. కనీసం జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ అక్కడి ఓటర్లను ఓటేయమని కూడా అడగలే.
మమ్మల్ని ప్రజలు ఓడించి తప్పు చేశారు. ఆ తప్పు తెలుసుకుని చెంప లేసుకుంటున్నారు. ఇక చచ్చినట్టు ఎన్నిక ఏదైనా మాకే ఓటేస్తారు.. ఇవే మాటలు తండ్రీ కొడుకుల నోటి వెంబడి. మేం తప్పు చేశాం.. లోపాలు తెలుసుకున్నాం.. చెంప లేసుకుంటున్నాం.. అని ఏనాడూ అనలేదు. పరివర్తన చూపలేదు. మారినట్టు కనిపించలేదు. కనీసం జనాల వద్ద లొంగినట్టూ నటించలేదు. అదే దర్పం.. అదే అహం.. అదే నియంత పోకడలు.. పదేండ్లు పాలించిన ధనం.. ఇవే వారిని నడిపించాయి. నడిస్తున్నాయి. కన్నూ మిన్నూ కానరాకుండా చేశాయి. అందుకే ఈ రిజల్టు ఇంతలా ఆ పార్టీని నిర్ధేశించింది. మీ స్థానం ఇక్కడేనని. మీరింతేనని. మీకు ఇంకా గుణపాఠాలు చాలా అవసరం అని.
ఇదంత ఆషామాషీ రిజల్టేమీ కాదు. కేటీఆర్ చాలా ఖర్చు పెట్టాడు. శ్రమకోర్చాడు. అధికార పార్టీకి ధీటుగా.. అంతకు మించే ఖర్చుకు వెనకాడలే. కోట్లు గుమ్మరించాడు. సోషల్ మీడియాను రంగంలోకి దింపి నానా యాగీ చేశాడు. జనరల్ ఎన్నికల్లో ఓడిన కసి తీర్చుకుని.. ఇక మాకు తిరుగేలేదని చెప్పాలనుకున్నాడు. అన్ని అస్త్రాలు వాడాడు. ఏదీ వదల్లేదు. తప్పుడు వార్తలకు కొదవే లేదు. తప్పుడు పనులకు లెక్కే లేదు. కారు కూతలకు అడ్డే లేదు. కోట్ల ఖర్చుకు తగ్గేదే లేదు.. ఇలా అన్ని చేసినా .. ఫలితం మాత్రం ఘోరంగా వచ్చింది. సానుభూతి లేదు.. గీను భూతి లేదు. సెంటిమెంటు లేదు. గింటిమెంటూ లేదు.. తండ్రి కొడుకులకు ఇంకా అహంకారం దిగలే. అందుకే ఈ రిజల్టు వారి అహంకారాన్నిదంచి.. వారిని నేలకు దించి.. తొడపాశం పెట్టి.. గుణపాఠం చెప్పి.. మారండిరా ఇకనైనా లని బుద్ది వచ్చేలా కర్రు కాల్చి వాత పెట్టారు జూబ్లీ జనం. ఇది సర్కార్‌కు రెఫరండం కాదు.. బీఆరెస్‌కు తెలంగాన ఇచ్చే రెఫరండం రిజల్ట్.. అర్థమైందా రాజా!
Dandugula Srinivas
Senior Journalist
7661066999
