వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
జూబ్లీహిల్స్ పోరు గంట గంటకు ఉత్కంఠగా మారుతోంది. కాంగ్రెస్, బీఆరెస్ మద్య పోటీ హోరాహోరీ పోరు కాస్త వార్ వన్ సైడ్ గా మారిపోయింది. కదన రంగాన్ని తలిపించిన ఉప ఎన్నిక మాగంటి మర్డర్ మిస్టరీ బయటకు రావడంతో బీఆరెస్ కొంప ముంచింది. ఈ ఎన్నికను వ్యక్తిగత వివాదాలు మరింత ఆసక్తిగా మార్చాయి. కేటీఆర్ పాపాల చిట్టా బయటపడుతున్నది. చివరి ఓవర్లలో మ్యాచ్ మలుపు తిరిగినట్టు.. పరిస్థితులు తారుమారవుతున్నాయి. మాగంటి గోపీనాథ్ కుటుంబ కథా చిత్రమ్.. బీఆరెస్‌ను సంకటంలో పడవేసింది. మొదట గోపీనాధ్ అన్న వజ్రనాథ్, నిన్న మొదటి భార్య మాలతీదేవీ, నేడు అమ్మ మహానంద కుమారీ ఒక్కొక్కరుగా ఎంటరవుతూ ఎన్నికల సీన్‌ను మార్చేశారు. వజ్రనాథ్, మాలతీదేవీల ఆరోపణలు కలకలం రేపగా.. మహానంద కుమారీ చేస్తున్న ఆరోపణలు జనాలను ఆలోచనలో పడవేస్తున్నాయి. కేటీఆర్ మీద ఆమె చేస్తున్న ఘాటైన విమర్శలు ఓటర్లను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి.
ఆమె తాజాగా కేటీఆర్‌పై , సునీతపై పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింతగా కలవరపెడుతున్నది బీఆరెస్ శిబిరాన్ని. ఆమె చాలా అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నది. మరణానికి ముందు ఘటనలపై పూర్తి విచారణ జరపాలని, డయాలసిస్‌లో జాప్యం, కిడ్నీ రిమూవల్ తరువాత చికిత్సలో లోపాలు, ఆస్పత్రి సెక్యూరిటీ, పర్సనల్ స్టాఫ్ పాత్ర, నెగ్లిజెన్స్, తమను ఆస్పత్రిలోనికి రాకుండా అడ్డుకున్న వారిపై చర్యలు… ఈ కీలకమైన అంశాలు ఫిర్యాదులో ఉన్నాయి. దీనిపై రాజకీయంగా ఇప్పటికే దుమారం రేగిన విషయం తెలిసిందే. ఓ వైపు బండి సంజయ్ కూడా ఫిర్యాదు చేశారు పోలీసులకు. పొంగులేటి కూడా అమ్మ ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు బీఆరెస్‌ను చుట్టిముట్టాయి. సంకటంలో పడేశాయి. బీఆరెస్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇవన్నీ. పోలింగ్ జరిగే సమయానికి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొన్నది. కేటీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మాగంటి మర్డర్ కేసు. ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని మూటగట్టేలా ఉన్నాయి ఈ సంఘటనలన్నీ.
