(దండుగుల శ్రీనివాస్)
సరిగ్గా సరిపోయింది. ఈ నానుడి బీఆరెస్ పార్టీకి. ఈ మాటన్నది సీఎం రేవంత్‌రెడ్డి. ఓ సందర్భంలో ఇలా వ్యాఖ్యానించారాయన. కేటీఆర్‌కు పగ్గాలిచ్చిన తరువాత ఆ పార్టీ పరిస్థితి నానాటికి దిగదిడుపుగా మారింది. మరింతగా పాతాళంలోకి పడిపోతూ వస్తోంది. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది పార్టీ దుస్థితి. కేసీఆరే పెద్ద నియంత. ఎవరినీ పట్టించుకోకుండా, తనకు తోచింది తాను చేసుకుంటూ పోవడము, ఉద్యమకారులను, కార్యకర్తలను విస్మరించడం అన్నీ చేశాడు. చేసిన తప్పే చేస్తూ వచ్చాడు తప్ప. ఎక్కడా తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయలేదు. పరివర్తన రాలేదు. ఓడినంక ఇంకా అహంకారానికి తోడు పైశాచికత్వం కూడా తోడయ్యింది. అందుకే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పరిమితమయ్యాడు.
కొడుకుకు పార్టీ అధికారాలిస్తే.. తండ్రికి మించిన ఘనుడని నిరూపించుకున్నాడు. బాప్ ఏక్ నెంబరీ, బేటా దస్ నెంబరీ… ఈ మాట కూడా రేవంతే అన్నారు. సేమ్ అట్లనే ఉంది మరి పరిస్థితి. ఏ ఎన్నికైనా కేసీఆర్ సీరియస్‌గానే తీసుకుంటారు. కచ్చితంగా అక్కడ ఓడుతామని అని తెలిసినా.. చివరి ప్రయత్నాలూ మానడు. ఆ టెంపోను వదలడు. కానీ ఈసారి విచిత్రంగా ఆయన కనీసం తమకే ఓటేయాలని ఓటర్లకు ఓ పిలుపు కూడా ఇవ్వలేదు. చివరి టైమ్‌లో ప్రచారానికి వస్తారని అంతా అనుకున్నారు. కానీ అదీ జరగలేదు.
ఓడిపోయే సీటుకు తను అనవసరంగా వచ్చి ఉన్న ఇజ్జత్ తీసుకోవడమెందుకని అనుకున్నాడా? ఆరోగ్యం సహకరించలేదా? నువ్వు లేకపోయినా.. రాకపోయినా నేను ఇక్కడ గెలిచి చూపిస్తాను చూడు అని చిన్న నియంత కేటీఆర్ తొడలు చరిచి శపథం పూనాడా? తెలియదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ పంతులు లేని బడి. ఆపార్టీ రాజకీయాలు వానాకాలం చదవుల లెక్క అల్లకల్లోలం. అంతే.
Dandugula Srinivas
Senior Journalist
7661066999
