వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైదరాబాద్‌

గంగా.. చంద్ర‌ముఖిగా మారిన‌ట్టు.. క‌విత ఒక ప్ర‌తిప‌క్ష పార్టీ లీడ‌ర్‌గా మారుతోంది. ఇటీవ‌ల ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. నాకు బీఆరెస్ కూడా ఓ కాంగ్రెస్‌, బీజేపీలాగేన‌ని. అంటే ఆమె ఇక నాన్న‌, కేసీఆర్.. అనే క‌వ‌రింగ్‌, క‌ల‌రింగ్‌, సింప‌తీని గెయిన్ చేసుకునే ప‌నికి స్వ‌స్తి ప‌లికింద‌న్న‌మాట‌. ఇక త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం కోసం, ప్ర‌త్యేక వేదిక కోసం ఎద‌రుచూస్తున్న‌ది. ఇంకా త‌ను తండ్రిచాటు బిడ్డెగా చెప్పుకోవ‌డాన్ని ఆమె టీమ్ కూడా ఒప్పుకోవ‌డం లేదు. ఒక‌రకంగా ఇది ఆత్మ‌వంచ‌న లాంటిదే. అందుకే ..ఆమె ఇక కేసీఆర్‌ను, కేసీఆర్ పాల‌న‌ను, బీఆరెస్‌ను ఏకిపారేయాల‌ని డిసైడ్ చేసుకున్న‌ది.

ఇక అన్న కేటీఆర్ సంగ‌తి స‌రేస‌రి. ఎవ‌రినీ వ‌దిల‌పెట్టేలా లేదు ఆమె.గ్రూపు-1 విద్యార్థుల విష‌యంలో ఆమె చేస్తున్న ఆందోళ‌న‌లో ఆమె కొత్త రూపు, కొత్త ర‌కం నిర్ణ‌యం ఆమె మాట‌ల్లోనే బ‌య‌ట‌ప‌డుతున్న‌ది. ఆమె మొద‌ట్లోనే సామాజిక తెలంగాణ సాధించ‌లేక‌పోయాం.. మేం త‌ప్పుచేశామ‌ని ఒప్పుకొని సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ మాట‌ల ప‌ద‌ను పెంచింది. కేసీఆర్ పాల‌న‌తో త‌ప్పులు జ‌రిగాయ‌ని ఒప్పుకున్న‌ది. ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించుకున్న‌ది. త‌నూ ఆ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామినే.. అవును.. ఆ త‌ప్పుల్లో, ఆనాటి పాల‌న అవ‌క‌త‌వ‌క‌ల్లో త‌నూ కూడా ఉన్నానంటూ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌రెండ‌ర్ అయ్యిందామె. దీని వెనుక ఆమెకుండే పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ ఆమెకుంది. అది వేరే విష‌యం. ఇదింకా స్ప‌ష్ట‌మైన కార్య‌రూపం దాల్చుకోనుంది. ఆమె త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే జిల్లాల ప‌ర్య‌ట‌నలో ప్ర‌జ‌ల‌కు త‌న ల‌క్ష్యం, త‌న ఉద్దేశ్యాల‌న్నీ వివ‌రించేందుకు ఆ కార్య‌క్ర‌మాన్ని ఓ వేదిక‌గా ఉప‌యోగించుకోనుంది.