వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌:

ఎన్నిక‌లు రాగానే బీసీల‌పై ఎన‌లేని ప్రేమ కురిపిస్తాయి అన్ని పార్టీలు. రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో మాత్రం ఎవ‌రూ ముంద‌డుగు వేయ‌లేదు. సాహించ‌లేదు. ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో.. ప‌దేళ్ల పాల‌న‌లో ఉన్న రిజ‌ర్వేష‌న్లు మింగి కూర్చుకున్నారు. అంతా నా ఇష్టం అన్న‌ట్టుగా సాగిన పాల‌న‌లో బీసీలు తీవ్ర అన్యాయానికి బ‌ల‌య్యారు. కేసీఆర్‌కు బీసీల పై న‌మ్మ‌కం లేదు మొద‌టి నుంచి. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా త‌న పార్టీని ప్ర‌క‌టించుకున్న కేసీఆర్‌.. ఆ త‌రువాత బీసీల‌కు తీవ్ర అన్యాయ‌మే చేస్తూ పోయాడు. ఉన్న రిజ‌ర్వేష‌న్లు త‌గ్గించేశాడు. దీనిపై బీసీలు గొంతెత్తినా ఎక్క‌డిక‌క్క‌డ త‌న నియంత పాల‌న‌లో వారిని అణిచివేశాడు. అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని, నియంత‌లా పాలించిన కేసీఆర్ పాల‌న బీసీల‌కు అంధ‌కార పాల‌న‌గానే మిగిలిపోయింది. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత కుల‌గ‌ణ‌న‌, బీసీ గ‌ణ‌న చేసిన త‌ర‌వాత కొంత ఊపిరి వ‌చ్చింది. మొద‌ట్లో న‌మ్మ‌కం లేక‌పోయినా.. స‌ర్కార్ చేస్తూ వ‌స్తున్న చ‌ర్య‌లు, తీసుకుంటున్న నిర్ణ‌యాలు బీసీల్లో కొత్త ఆశ‌ల‌ను చిగురింప‌జేశాయి.

బీసీల 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం స‌ర్కార్ చిత్త‌శుద్దితో చేసిన చ‌ర్య‌ల‌న్నీ బీసీ స‌మాజం చాలా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించింది. ఏదో మోస‌పూరిత వాగ్దానాల మాదిరిగా కాకుండా అధినేత రాహుల్ గాంధీ స్పూర్తితోనే ఆ దిశగానే ప్ర‌తీ అడుగు ముందుకు వేసింది బీసీల విష‌యంలో ఇక్క‌డి కాంగ్రెస్ స‌ర్కార్‌. మొత్తానికి ఎన్నో ఆటంకాలు, అవ‌రోధాలు దాటి చిత్తుశుద్దితో, నిర్మ‌ల‌మైన మ‌న‌స్సుతో ఓ య‌జ్ఞంలా రేవంత్ ప్ర‌భుత్వం చేసిన చ‌ర్య‌ల‌న్నీ ఇప్పుడు స‌ఫ‌లీకృత‌మ‌య్యాయి. ఆ ఫ‌లాలు అందుకునే దిశ‌గా బీసీ స‌మాజం రెడీగా ఉంది. దీన్ని నిలువ‌రించేందుకు న‌క్క విన‌యాలు ప్ర‌ద‌ర్శించిన బీజేపీ, బీఆరెస్‌లు బీసీ స‌మాజానికి దూర‌మ‌య్యార‌నే చెప్పాలి. కోడి గుడ్డు మీద ఈక‌లు పీక‌ట్టుగానే .. అడ‌గ‌డుగునా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను టెక్నిక‌ల్ పాయింట్ల‌ను ఆధారంగా, సాకులు వెతుక్కుంటూ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసి బీసీల ముందు మ‌రింత ప‌లుచ‌న‌య్యాయి ఈ రెండు మిత్ర‌పార్టీలు. ఇప్పుడు బీసీల మ‌న‌సు గెలిచిన పార్టీ ఒక్క కాంగ్రెస్సే. ఇది తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నిక‌పై ఎప్ప‌టికీ మ‌రిచిపోని ఓ చారిత్రాత్మ‌క ఘ‌ట్టంగానే ఉండిపోతుంది.