(దండుగుల శ్రీనివాస్)
ఆ తండ్రి కొడుకుకే సపోర్టు. బిడ్డపై కనికరం కూడా చూపలేదు. నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. కానీ ఆ బిడ్డ తండ్రి మాటను జవదాటలేదు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైనా తండ్రిని పల్లెత్తు మాట అనలేదు. ఆ వేలు పట్టి నడచిన జ్ఞాపకాలు నెమరేసుకున్నది. ఆయన చూపిన తోవలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నది. తన రాజకీయ పరిపక్వతకు అనుభవాన్ని అందించిన తండ్రి బాటలోనే కొనసాగుతున్నానని కూడా తాజాగా ప్రకటించుకున్నది. అన్న ఓవైపు, హరీశుడు, సంతోషుడు మరోవైపు ముప్పేట దాడి చేస్తున్నా.. అవన్నీ తిప్పికొడుతూ తన పంథాతో తాను పోతున్నది కవిత. ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. కొత్త రాజకీయ పార్టీ గురించి కొంచెం క్లారిటీ ఇచ్చింది కూడా. తన తండ్రి కేసీఆర్‌లాగే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నానన్నది. అంటే.. అంతిమంగా తన సిద్ధాంతం ప్రకారం, తను అనుకుంటున్న విధానాలననుసరించి కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. కొంచెం సమయం పట్టొచ్చు. కానీ పార్టీ పెట్టడం మాత్రం ఖాయంగా తోస్తున్నది. ఆమె మాటల వెనుక అంతరార్థం ఇదే కనిపిస్తున్నది.
ఇక తండ్రి బాటలోనే కొనసాగుతున్నానని చెప్పుకుంటున్న కవిత.. తన మలిదశ రాజకీయాన్ని.. సెకండ్ ఇన్నింగ్స్‌ను కొత్త రాజకీయాన్ని తండ్రి సొంతూరు చింతమడక నుంచే ప్రారంభించేందుకు సంసిద్ధమయ్యింది. ఎంగిలిపూల బతుకమ్మ కు ఆమెను ఆ ఊరు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అందుకే ఆమె ఫస్ట్ ప్రయార్టీగా అక్కడి నుంచే బతుకమ్మ పండుగను ప్రారంభించనున్నది. ఆ తరువాత వరుస క్రమంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో బతుకమ్మ సంబురాలను జాగృతి నేతృత్వంలోఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ వేరుపడినా.. తనను కాదని ఒంటరిని చేసినా.. తండ్రి బాటలోనే కొనసాగుతూనే … పార్టీని భ్రష్టు పట్టిస్తున్న దయ్యాల పని పట్టే విషయంలో మాత్రం కవిత ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భవిష్యత్తులో ఆమె ఈ దూకుడును మరింత పెంచేలా కనిపిస్తున్నది.
