(దండుగుల శ్రీనివాస్)
ప్రెస్‌మీటంతా పాత కథే. కొత్త విషయమేమీ లేదు. ఓ హరీశ్, ఓ సంతోష్.. అవినీతి, అక్రమాలు… మేకవన్నె పులులు. నన్ను బలి చేశారు. మిమ్మల్నీ బలి చేస్తాను అన్నా, నాన్న..! ఇది తప్ప ఆమె పెద్దగా బయట పడలేదు. ఇంకా కుండబద్దలు కొట్టలేదు. కానీ ఓ సంఘటన దగ్గర మాత్రం హింట్ ఇచ్చింది. తను ఇబ్బంది పడింది.. ఇమడలేకపోతున్నది.. లోపాలు బయటపెట్టేది… ప్రశ్నిస్తన్నదీ.. నిలదీస్తున్నది… ఎందుకనే విషయం సూచాయగా మాత్రం చెప్పింది. అది అన్న గురించి. అదే రామన్న గురించి. ఏమన్నది… తనపై కుట్రలు జరుతున్నాయని తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబితే… అదీ లేఖ లీక్ కాకముందే..! కానీ కేటీఆర్ అస్సల్ పట్టించుకోలే. ఏమైందని కనీసం ఫోన్ చేయలె. చెల్లెగా పట్టించుకోలేదు సరే… కనీసం ఆ పార్టీ ఎమ్మెల్సీగానైనా పట్టించుకోవచ్చు కదా… ఏమైందని అడగొచ్చు కదా. నాకే ఈ పార్టీలో ఇంతటి మర్యాద ఇచ్చిన రామన్నా.. ఇక మామూలు కార్యకర్తను ఎలా పట్టించుకుంటావు..? ఇదొక్కటే ఆమె మనసులోని అంతరంగాన్ని,ఆవేదనను ఆవిష్కరించింది.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నీ దగ్గరకే కదా మేమంతా వచ్చేది.. ప్రతీది నాన్నతో చెప్పుకోలేను కదా.. అన్నదామె. అంటే నాన్న తరువాత నాన్నలా ఉన్న నువ్వే నన్ను పట్టించుకోలేదు.. ఇక ఎవరి బాధలు ఎవరికి చెప్పుకుంటే తీరుతాయో ..? అని ఆమె వైరాగ్యంతో మాట్లాడిన తీరు.. అన్న మీద ఉన్న ఆగ్రహాన్ని, తీవ్ర ఆవేదనను పట్టించింది.
అధికారంలో ఉన్నప్పుడు కూడా తనను ప్రతిపక్ష నేతగా చూశారని ఆమె బయటపడ్డది. అప్పుడు కూడా నడిపించుకుంది.. అంతా తానై ఉన్నది.. షాడో సీఎంగా వ్యవహరించింది కేటీయారే. అందుకే ఆనాటి నుంచి ఆమె మనసులో తనకు జరుగుతున్న అవమానాలు, ఆత్మక్షోభను తొక్కిపెట్టుకున్నదనే విషయం తేటతెల్లమైంది. అధికారం కోల్పోయి…ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కవితను పార్టీ మరీ దూరం చేసింది. కేసీఆర్ ఏకైక లక్ష్యం.. ఎలాగైనా కేటీఆర్‌ను సీఎం చేయాలని. అందుకే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అతన్నే చేశాడు. వేల కోట్ల పార్టీ ఫండ్ కు చెక్‌పవర్‌ను ఇచ్చింది కూడా అతనికే. మరి కవితకేం ఇచ్చాడు. ఏం ఇవ్వలే. అసలు పట్టించుకోలే. పట్టించుకునే స్థితిలో కేసీఆర్ లేడు.. కేటీఆర్ అసలే లేడు. అందుకే ఆమె తిరుగుబాటు బావుటా ఎగురవేసింది.
లోపాలు, పాపాలు బయటపెట్టడం మొదలు పెట్టింది. హరీశ్, సంతోష్‌లపై పూర్తి వివరాలు బయటపెట్టింది. కానీ కేటీఆర్ గురించి బయటపెట్టేందుకు ఆమె జంకుతున్నది. ఎందుకంటే కేసీఆర్‌కు అన్నంటే ప్రేమ. తనను పరోక్షంగా ఇబ్బంది పెట్టినా ఊరుకున్నాడు కానీ, పార్టీ భవిష్యత్ నాయకుడు, కథా నాయకుడైన కేటీఆర్‌ను కూడా దెబ్బ తీసే విధంగా మాట్లాడితే ఆయన ఆగ్రహానికి అవధులుండవు. కాబట్టే ఆమె అన్న విషయంలో ఆచితూచిగానే విమర్శలు గుప్పించింది. అన్నగా ఫెయిల్ అయ్యావనే విషయాన్ని మాత్రం సెంటిమెంట్ అస్త్రాన్ని మాత్రం ప్లే చేసింది సక్సెస్‌ఫుల్‌గా.
యూట్యూబ్‌లను మెయింటేన్ చేసేందుకే కేటీఆర్‌కు సరిపోవడం లేదనే విషయాన్ని కూడా ప్రస్తావించింది కవిత. పార్టీలో జరుగుతున్నది గ్రహించకుండా, నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా యూట్యూబ్‌ల వెంట పడుతున్నాడని ఎద్దేవా చేసిందామె. హరీశ్ మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నాడని, కేటీఆర్ కూడా మీడియా మేనేజ్మెంట్ నేర్చుకోవాలని హితవుతో కూడా వెటకారం చేసిందామె. మొత్తానికి ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవనే విషయం ఆమెకు ఆనాడే తెలిసిపోయింది. కానీ సమయం కోసం చూసింది. ఇప్పుడిలా బయటపడింది అంతే. అన్న వైనే నాన్న.. నాన్నకు లేదు తనపై ప్రేమ.. అందుకే పార్టీకి రామ్ రామ్.. ఇక నా దోవ నేను చూసుకోబోతున్నా… ఇదే ప్రెస్‌మీట్ సారాంశం.
Dandugula Srinivas
Senior Journalist
8096677451