(దండుగుల శ్రీ‌నివాస్‌)

తెలంగాణకు జాతిపిత అని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. దాదాపుగా జ‌నం న‌మ్మారు. రెండు సార్లు.. అంటే ప‌దేండ్లు అధికారం ఇచ్చారు. పుట్టి పెరిగిన బుద్ది మేన‌మామ‌ల‌కెర‌క‌న్న‌ట్టు… అధికారం ఇచ్చిన త‌రువాతగానీ తెలియ‌లే అస‌లు రూపం. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని చెర‌బ‌ట్టిన వైనం ఒక్కొక్క‌టిగా అర్థ‌మై, అవ‌గ‌తం చేసుకున్న త‌రుణంలోనే క‌ర్రుకాల్చి వాత పెట్టారు. అవ‌న్నీ ఒకెత్తైతే కాళేశ్వ‌రం స్కాం.. ఒక ఎతు. యావ‌త్ తెలంగాణ‌నే తాక‌ట్టు పెట్టారు. 1.25ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి.. ఖ‌జానా మొత్తం ఊడ్చి పెట్టారు. వేలకు వేల కోట్లు దోచుకునేందుకు ఇది ఓ ఏటీఎం సెంట‌ర్‌లా ఉప‌యోగ‌ప‌డింది. ఒక్కొక్క‌టిగా నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు ఆ ఇంటి ప‌క్షులే. చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. వేట మొద‌లైంది. ఆ ఇంటి ఆడ‌బిడ్డే సాక్షాత్తు ముందుకు వ‌చ్చి ఇది హ‌రీశ్‌రావు మాస్ట‌ర్ మైండేన‌ని చెప్పేసింది.

దీని వెనుక సంతోష్‌రావు, ధ‌న దాహం ఉంద‌ని, వేల‌కు వేలు కోట్లు దోచుకుతిన్నార‌ని కూడా చెప్పింది. మొన్న‌టి వ‌ర‌కు గుమ్మ‌డికాయల దొంగ‌ల్లెక్క‌నే భుజాలు త‌డుముకున్న కేసీఆర్ అండ్ బ్యాచ్‌.. ఇప్పుడు ఆయ‌న కూతురే ఇంత‌టి ఆరోప‌ణ‌లు చేసినంక‌.. ఇక త‌ప్పించుకునే దారిలేక‌..బిడ్డెనే బ‌య‌ట‌కు సాగ‌నంపేందుకు సిద్ద‌మైతున్నాడు. హ‌రీశ్‌రావు అండ్ టీమ్‌ను త‌న వెనుక ఉంచుకుని కాపాడుకుంటున్నాడు. ఇది దేనికి సంకేతం..? దోచుకున్న‌దంతా ముఠానేనా..? ఆ ముఠాలో ఎంత మంది స‌భ్యులున్నారు..? ముఠా నాయ‌కుడెవ్వ‌రు..? ఇవ‌న్నీ తేల్చేందుకు సీబీఐ రెడీ అవుతోంది. స‌ర్కార్ సీబీఐకి లేఖ రాసింది. అక్క‌డ దాన్ని స్వీక‌రించారు. ఇక కేసీఆర్ నో ఎంట్రీ బోర్డు పెట్టిన సీబీఐ రాష్ట్రంలోకి అడుగు పెట్ట‌నుంది. నిజ నిజాలు నిగ్గు తేల్చ‌నుంది.

రాష్ట్రం అప్పుల్లో ఉంది. ప్ర‌తీ వ్య‌క్తి త‌ల‌మీద ల‌క్ష‌ల అప్పులున్నాయి. ఖ‌జానా ఖాళీ అయ్యింది. తేరుకోని స్థితిలో రాష్ట్ర ఆర్థిక స్తితి ఉంది. కానీ బీఆరెస్ నేత‌లు మాత్రం ఈ ప‌దేండ్ల కాలంలో కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు. ఎవ‌రికి దొరికినంత వారు దోచుకున్నారు. వంద‌లు, వేల కోట్లు వెన‌కేసుకున్నారు. స్వ‌యంగా క‌వితే.. అంటే మాజీ సీఎం కేసీఆర్ బిడ్డె ఈ మాట‌న్న‌దంటే.. ఆ పాల‌న ఎంత‌టి అవినీతిమ‌యమో అర్థం చేసుకోవాల్సిందే. అందులో కాళేశ్వ‌రం లాంటి భారీ నీటి పారుద‌ల ప్రాజెక్టు పేరుతో ల‌క్ష కోట్ల సంప‌ద‌ను నీటి పాలు చేసే విధంగా.. అందులో వేల కోట్ల‌కు అవినీతికి పాల్ప‌డి.. జ‌నం సొమ్మంతా వృథా అయ్యే విధంగా చేసిన పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి.

అధికారం కోల్పోయి రెండేండ్లు కూడా కాలేదు. అప్పుడే పాపాల చిట్టా బ‌య‌ట‌ప‌డ్డ‌ది. కానీ నేరం చేసిందెవ‌రు..? శిక్షెవ‌రికి? జ‌నం న‌మ్మిన పాపానికి మోసం చేసిందెవ‌రు..? చేసిన ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గ‌ట్టెక్కాలె. నేత‌లు బాగానే ఉన్నారు. దోచుకుని కోట్లు వెన‌కేసుకున్నారు. జ‌నం న‌మ్మ‌క‌మే వారికి తాక‌ట్టైంది. త‌లకు ల‌క్ష‌ల అప్పులు చుట్టి.. వాళ్లు మాత్రం సేఫ్ రాజ‌కీయాలు చేస్తున్నారు. మ‌ళ్లీ న‌మ్మించేందుకు వ‌చ్చినా జ‌నం మాత్రం న‌మ్మేలా లేరు. జాతిపిత కాదు కదా…న‌మ్మించి గొంతు కోసిన దొంగ‌ల‌ముఠాగానే చూస్త‌రు. ఇంకా నిజాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. వీరి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డం ఖాయం కానుంది. ఒక‌రి లోపాలు మ‌రొక‌రు.. ఒక‌రి త‌ప్పులు మ‌రొక‌రు.. నువ్వింత తిన్న‌వంటే.. నువ్వింత తిన్న‌వ్‌..! అని వాళ్ల‌కు వాళ్లు లెక్క‌లు బ‌య‌టేసుకుని .. జ‌నం ముందు దొంగ‌ల ముఠాల‌మ‌నే విష‌యాన్ని వారి ప్ర‌వ‌ర్తనే తేట‌తెల్లం చేయ‌నుంది. దేశ‌వ్యాప్తంగా రాష్ట్రాన్ని వార్త‌ల్లో ఉంచి, అతిపెద్ద కుంభ‌కోణానికి తెర‌తీసిన బీఆరెస్ మాత్రం చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed