(దండుగుల శ్రీనివాస్)
ఓయూ అంటే అంతే. తెలంగాణలో ఏ ఉద్యమం లేవలన్నా అక్కడి నుంచే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ ఉద్యమానికది దిక్సూచి. కేసీఆర్‌నూ ప్రశ్నించి, నిలదీసిన చైతన్య దీపికది. అక్కడ అడుగు పెట్టాలంటే అధికార పార్టీకి హడల్. అందుకే పదేండ్లూ సీఎంగా ఉన్న కేసీఆర్ అక్కడికి రాలేదు. రావాలంటేనే జంకాడు. కానీ సీఎంగా రేవంత్ రెడ్డి అక్కడి కార్యక్రమాలకు హాజరుకావడమే కాదు… ఆయన ఇచ్చిన స్పీచు విద్యార్థి లోకానికి స్పూర్తిదాయకంగా నిలిచింది. ఓయూకు జవజీవాలిచ్చేలా ఉంది.
ఆ చారిత్రాత్మక విద్యాకెరటానికి కిరీటం పెట్టినట్టుగా ఉంది. మళ్లా వస్తానన్నారాయన.డిసెంబర్ నెలలో డేట్ ఫిక్స్ చేయమన్నారు. వచ్చి అన్ని సమస్యలు తీరుస్తానన్నారు. చెప్పడం మీ విధి. తీర్చడం నా బాధ్యత… అని హెచ్‌వోడీలకు పూర్తి స్వేచ్చను ప్రసాదించారాయన. అడ్డుకోవడం వద్దు.. ఏమి కావాలో చెప్పండి.. అన్నీ చేస్తా. ఏదీ వదల. మీరు మార్గదర్శకులు. ప్రపంచంలో ఓ విద్యా కీర్తి కెరటాలు. మిమ్మల్ని మరింత రాటు దేలేలా.. రాణించేలా చేయడం నా బాధ్యత అన్నారాయన. చదువుతోనే మీరు శ్రీమంతులవుతారు. నాణ్యమైన విద్యకు ఏం కావాలో నే చేస్తా… మీరు చదివి పరిపూర్ణులవ్వండి.. దేశాన్ని, రాష్ట్రాన్ని విద్యాధికులుగా, శ్రీమంత రాజ్యంగా మార్చండని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.
మానవ మృగాలను ఫాం హౌజ్‌కు పంపారు.. షెబ్బాష్.. లేదంటే ఓయూను లేవట్ చేసి ప్లాట్లుగా విభజించి అమ్మేసుకునేవారని… గత పాలకలనద్దేశించి ఆయన అన్నారు. సీఎం స్పీచ్‌కు ఆసాంతం విద్యార్థి లోకం ఉర్రూతలూగింది. కేకలు, ఈలలతో కొత్త ఉత్సాహాన్ని రెట్టించారాయన. ఆ స్పీచ్ ఓ సీఎంలా కాకుండా ఓ ఉద్యమకారుడిలానే ఉంది. ఓ విద్యార్ధి మనసు తెలిసిన విద్యార్థి నాయకుడి అంతరంగంలాగే ఉంది. తప్పులు ఎత్తి చూపే ఓ ప్రొఫెసర్ లెక్కనే ఉంది. తమ లోపాలు తెలిసి మసులుకునే ఓ ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడిలాగే ఉంది. అందుకే అందరికీ నచ్చింది. చప్పట్లు మార్మోగాయి.. తమ సంఘీభావం తెలుపుతు. మళ్లీ వస్తానని సీఎం అన్న మాటలకు ఆ హర్షద్వానాలు మార్మోగాయి రారమ్మని. ఇదే మా ఆహ్వానమని.
Dandugula Srinivas
Senior Journalist
8096677451