(దండుగుల శ్రీనివాస్)
ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ.. మాట్లాడితే సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నాడనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి విపరీతంగా వినిపిస్తున్నాయి. ఆఫ్ సెంచరీ కూడా పూర్తి చేశారని కూడా లెక్కలు వేసి గుర్తు పెట్టుకుని మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరెన్ని అన్నా.. రాష్ట్ర అవసరాల కోసం ఢిల్లీకి అవసరైమనప్పుడల్లా వెళ్తూనే ఉంటా.. నేనేమన్న గోటీలు ఆడుకుంటందుకు పోతున్ననా? అని కూడా ఘాటు జవాబే ఇచ్చారు సీఎం. సరే, ఇదలా ఉంచితే ఆయన అనుకోకుండా ఆకస్మిక పర్యటన చేశారు సిటీలో. ఇటీవల భారీ వర్షాలతో భాగ్యనగరం బస్తీలన్నీ నిండా మునిగాయి. ఓవైపు వరలక్ష్మీ వ్రతం పూజలు, తెల్లారితే రాఖీ పండుగు.. వరుస సెలవుల నేపథ్యంలో వరుణుడు మాత్రం ఫుల్ డ్యూటీ చేశాడు.
తుక్కు తుక్కు వర్షం పడింది. బస్తీలన్నీ మునిగిపోయాయి. రోడ్లన్నీ వరదమయమయ్యాయి. మూసీ పొంగి పొర్లింది. మ్యాన్ హోళ్లు హోరెత్తాయి. జన జీవనం అతలాకుతలమైంది. ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించి పోయింది. ఎమర్జన్సీ వ్యవస్థ నిద్రలేని రాత్రులు గడిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం సీటీలోకి ఎంటరయ్యారు. బస్తీల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులను ఆదేశించారు. బస్తీల్లో తిరిగారు. గల్లీబాటలో జనంతో మాట కలిపారు. ఢిల్లీకి పోవుడే కాదు.. జనం గోస తెలుసుకునేందుకు గల్లీల్లో కూడా తిరిగుతానని తెలియజేశారు. సీఎం రేవంత్ చర్యలకు బస్తీ జనం బాగుబాగన్నారు. గల్లీ ప్రజలు శభాష్ అని కొనియాడారు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451