(దండుగుల శ్రీనివాస్)
ఒకడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కి పడుతున్నాయి బీఆరెస్ పార్టీవి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇలా తేరుకుని ఊపందుకుంటుందన్న ప్రచారం వచ్చీరాగానే నిండా కష్టాల్లో కూరుకుపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఇప్పుడు బోనులో నిలబడి ఉన్నారు. వీరిని శిక్షించడం తప్పదు. తప్పనిసరి. అదే రేపా మాపా అనేదే తేలాల్సి ఉంది. కాంగ్రెస్ సర్కార్ వీరి తప్పులన్నీ తోడింది. అష్టదిగ్బంధనం చేసింది. సీరియళ్లలా సాగిన విచారణ ఓ కొలిక్కి వచ్చింది. కథ క్లైమాక్స్ చేరింది. చర్యలు తీసుకోవడమే తరువాయిగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన తుది నివేదికలో కేసీఆర్‌ను మొదటి దోషిగా నిలబెట్టింది. రెండో దోషిగా హరీశ్ ఉన్నాడు. ఇక కేటీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుస్తోంది. ఈ- ఫార్మూలా కారు రేస్ కేసు విచారణ కూడా తుది దశకు వచ్చింది. ఒక్కొక్కటిగా విచారణల నిరూపణలు కల్వకుంట్ల ఫ్యామిలీ పీకల మీదకు తెస్తున్నాయి.
లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటుదామనుకున్న బీఆరెస్ నేతలకు అంత సీన్ లేదనే విధంగా వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. మరోవైపు కల్వకుంట్ల కుటుంబం కష్టాల్లో ఉండగానే.. మాజీ ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు. బీజేపీతో దోస్తానా దోబూచులాటకు తెరపడటంతో ఇక బీజేపీనా, కాంగ్రెస్సా? అనే ఆలోచనలో పడ్డారు. కేసీఆర్‌తో మాత్రం ఉండేలా లేరు. అప్పటి వరకు రాముడెవడో రాకాసుడెవడో.. అన్నట్టుగా మూడేండ్లు ఓపిక పట్టేలా లేరు. కేటీఆర్ అందరినీ కలుపుకుపోకపోవడం, కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తమకు జరిగిన అవమానాలు, ఆత్మగౌరవం దెబ్బతినడం.. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటన్నారు. సమయం వచ్చింది ..అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
దాదాపు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పెద్దాయనకు ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఫామ్‌హౌజ్ లో మీటింగు పెట్టుకున్నాడు యధావిథిగా. అరెస్టులు తప్పవనే సంకేతాలిచ్చాడు పార్టీ క్యాడర్‌కు. ఆ అరెస్టులేవో తొందరగా చేస్తే బాగుండనే అభిప్రాయం వినిపిస్తోంది చాలా మందిలో. అయితే సర్కార్ మాత్రం దీన్ని కక్షసాధింపు చర్యలుగా చూడకుండా.. పద్దతి ప్రకారం, చట్టానికి లోబడి సమయం వచ్చినప్పుడే బోనెక్కించాలని చూస్తోంది.
