(దండుగుల శ్రీనివాస్)
మళ్లీ మంత్రి పదవి గోల. ఇంట్లో ఒకరికి ఆల్రెడీ మంత్రి పదవి ఉండనే ఉంది. మళ్లీ తనకో మంత్రి పదవి కావాలట. తనను పార్టీలోకి తీసుకునే ముందు మాటిచ్చారట. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే తప్పకుండా ఇస్తామని కూడా నొక్కి వాక్కాణించారట. అక్కడ ఢిల్లీలో బీసీల కోసం కొట్లాడుతున్నది కాంగ్రెస్ సర్కార్. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాల్సిందే. ఇస్తారా? చస్తారా?? అనే రేంజ్‌లో కొట్లాటకు దిగింది కేంద్రంతో. ఇక్కడ ముందే రెడ్లు ఎక్కువై పోయారు సామీ.. అని అధిష్టానం తలపట్టుకుని.. ఇంకో బీసీకి మంత్రి పదవి ఇద్దామా అనే ఆలోచనలో ఉంటే.. మధ్యలో మళ్లీ ఈ అసందర్భ ప్రేలాపన. తనకు మంత్రి పదవి ఇస్తే అది ప్రజలకే మేలట.
అంటే ఇప్పుడు మంత్రి పదవులు నిర్వహిస్తున్న వారితో ప్రజలకు ఏమాత్రం మేలే లేదంటావా హోమంత్రిత్వ శాఖ కోరిన మంత్రికాని మంత్రిగారు. ఇప్పుడిప్పుడే రెడ్ల కాంగ్రెస్ అనే ముద్ర నుంచి బయటపడి బీసీల ప్రేమను చూరగొనే ప్రయత్నం చేస్తున్నది రేవంత్ సర్కార్. కీలకమైన శాఖల్లో అధికారులంతా రెడ్లే. కార్పొరేషన్ చైర్మన్లలో వారిదే.
అంతా వారే… అనే ముద్ర ఉండనే ఉంది. ఈ సమయంలో … అదీ బీసీల లొల్లి నడుస్తున్న సందర్భంలో.. ఏకంగా ఢిల్లీలోనే సీఎం సహా అంతా అక్కడికి తరలి బైఠాయించి నిరసన తెలుపుతున్న తరుణంలో ఈ బ్లాక్ మెయిలింగ్ వార్నింగులేలా గోపాలా? అయితే మళ్లీ త్యాగానికి పూనుకుంటానంటావ్? బెదిరేదెవరు? అదిరేదెవరు? ఎప్పుడూ సమయం ఒకేలా ఉండదు. రాజీనామా చేసి చూడు జనం ఏమనుకుంటున్నారో? ఏమైతదో తెలుస్తది?
Dandugula Srinivas
Senior Journalist
8096677451
