ఢిల్లీ- వాస్తవం:
తెలంగాణ సర్కార్ తీసుకున్న చొరవ, కృషితో జల వివాదాల శాశ్వత పరిష్కారానికి నాంది పడింది. నీ వాటా ఎంత..? మా వాటా ఎంత..? జల దోపిడీ చేసింది మీరంటే మీరు.. అనుకునే పరిస్థితులు లేకుండా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఈ మేరకు ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు వివరించారు. గోదావరి, కృష్ణా… వాటి ఉప నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు… నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల్లోని వివిధ అంశాల పరిశీలనకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, జల్‌శక్తి అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు.
జల్‌శక్తి, ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల కమిటీ గోదావరి, కృష్ణా నదుల నీటి కేటాయింపులు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నసమస్యలను ఆ కమిటీ పరిశీలించి చర్చిస్తుందని సీఎం వెల్లడించారు. ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై పైస్థాయిలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. కృష్ణా నది జలాల్లో ఏ రాష్ట్రం ఎంతమేర వినియోగించుకుంటున్నదనే విషయంపై టెలీమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించగా… దానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిదన్నారు. ఈ రకంగా ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ), ఇతర సంస్థలు తెలిపిన వివరాలపై చర్చించి మరమ్మతుల విషయాన్ని ప్రస్తావించగా.. మరమ్మతులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని సీఎం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం… తర్వాత కాలంలో జరిగిన అపెక్స్ కమిటీలో గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోటి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారని.. గోదావరి నదియాజమాన్య బోర్డును తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు.